మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్టు.. విడిచిపెట్టాలంటూ భర్త, మామ హల్చల్
ABN , First Publish Date - 2020-10-28T14:49:40+05:30 IST
కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న..

బాపట్ల(గుంటూరు): కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కుంచాల జ్యోతి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం బాపట్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తన భార్యను అన్యాయంగా అరెస్టు చేశారంటూ భర్త కుంచాల నాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతనిని స్టేషన్‌కు తీసుకురాగా బ్లేడుతో ఛాతీ, చేతిపై కోసుకుని తన భార్యను విడిచిపెట్టాలని బెదిరించాడు.
తాను ముఖ్యమంత్రి జగన్ అభిమానిని అని, ఛాతీపై జైజగన్ అని పచ్చబొట్టు వేయించుకున్నానని తమను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని వాదనకు దిగాడు. అడగినంత లంచం ఇవ్వలేదనే కారణంతోనే అధికారులు ఈ విధంగా చేశారని ఆరోపించాడు. ఇదిలా ఉండగా తన కోడలు, కొడుకును విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ కుంచాల సింగారెడ్డి కర్లపాలెం మండల కేంద్రంలో ఓ అపార్ట్మెంట్ పైకి ఎక్కి దూకుతానంటూ హల్చల్ చేశాడు. వారి ఆరోపణలో ఎటువంటి నిజం లేదని ఎక్సైజ్ సీఐ వెంకటరమణ తెలిపారు. తమపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యాయత్నం చేస్తూ బెదిరించాడని తెలిపారు.