హత్యకేసులో నిందితులు అరెస్టు

ABN , First Publish Date - 2020-12-07T04:58:09+05:30 IST

నగరం పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన మహిళ హత్యకేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు.

హత్యకేసులో నిందితులు అరెస్టు

బాపట్ల, డిసెంబరు 6: నగరం పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన మహిళ హత్యకేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం బాపట్ల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.  గత నెల 4వ తేదీన ఇంటూరు సమీపంలోని పూడివాడ మురుగుకాల్వలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె చెరుకుపల్లిలోని కొత్తపేటకు చెందిన కొఠారి సామ్రాజ్యంగా గుర్తించారు. సామ్రాజ్యం ఇంటూరుకు చెందిన పోతర్లంక శ్రీనివాసరావుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇంటూరులో అప్పులు చేసిన శ్రీనివాసరావు బాపట్లకు వచ్చి నివాసం ఉంటున్నాడు. సామ్రాజ్యం వద్ద ఉన్న నగలుపై కన్నేసిన శ్రీనివాసరావు నవంబరు 3న ఆమెను నిజాంపట్నం మండలం కోనఫలం గ్రామానికి ఓ శుభకార్యానికి తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెతో తాగించి మురుగుకాల్వలో ముంచి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న ఐదున్నర సవర్ల బంగారం, వెండి తీసుకొని  పరారయ్యాడు. బెస్తపాలెం చేరుకుని భార్య పద్మావతికి తెలియజేసి రూ.లక్షా2 వేలకు బంగారాన్ని విక్రయించాడు. పోలీసుల విచారణ కొనసాగుతుండగా శ్రీనివాసరావు దంపతులు వీఆర్వో విజయసాగర్‌ వద్దకు వచ్చి ఈనెల 5వ తేదీన లొంగిపోయారు హత్యకేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన సీఐ జి.శ్రీనివాసరావు, నగరం ఎస్‌ఐ వాసులతోపాటు సిబ్బందిని అభినందించారు. 

Read more