న్యాయం అడిగితే కేసులా?

ABN , First Publish Date - 2020-05-09T07:50:46+05:30 IST

తాము చేస్తున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వస్తోందన్న అక్కసుతో తమపై బురదజల్లే

న్యాయం అడిగితే కేసులా?

అందరి క్షేమం కోరి రాజధానికి భూములిచ్చాం..

మాపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

విశాఖ దుర్ఘటనలో మరణించిన వారికి రైతుల నివాళి

143వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): తాము చేస్తున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వస్తోందన్న అక్కసుతో తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి రైతులు అరోపిస్తున్నారు. ప్రభుత్వం చేసిన కుట్రలకు అన్ని విధాల నష్టపోయి, అమరావతి కోసం పోరాడుతుంటే మాపైన హత్యాయత్నం కేసులు.. అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ మీద పిక్‌ పాకెటింగ్‌ కేసులు పెడతారా..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని రైతులు నిలదీశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 143వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా రైతులు, మహిళలు, కూలీలు ఎవరి ఇంట్లోవారే కూర్చొన మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు.  విశాఖలో జరిగిన ఎల్జీ గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో మరణించిన వారికి సంతాంప తెలియజేస్తూ కొవ్వుత్తులు వెలిగించి మౌనం పాటించారు. 


అనంతవరం, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, వెలగపూడి, రాయపూడి, మందడం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం తదితర 29 గ్రామాల రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం బడేపురం, పొన్నెకలు, మోతడక తదితర గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు.  సోషల్‌ మీడియాలో అధికార పార్టీకి చెందిన కొందరు తమపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని రైతులు వాపోయారు. అమరాతితోనే రాష్ట్రానికి వెలుగంటూ రాత్రి 7.30 గంటలకు ఐదు నిమిషాలపాటు ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆపీ కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి జై అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. 

Updated Date - 2020-05-09T07:50:46+05:30 IST