కష్టం.. కృష్ణార్పణం

ABN , First Publish Date - 2020-10-19T09:49:36+05:30 IST

కష్టం.. కృష్ణార్పణం

కష్టం.. కృష్ణార్పణం

కుళ్లిన పంటలు చూసి కన్నీటి పర్యంతం

మోటార్లతో పొలాల్లోని నీటిని తరలించే యత్నం

వరద ముప్పు పొంచి ఉందన్న వార్తలతో రైతుల్లో దడ

లంకల్లో వరద నష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నం

అంతంత మాత్రంగా లంక గ్రామాల్లో సహాయక చర్యలు 

కొల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ సమీక్ష



రెక్కల కష్టం.. కృష్ణార్పణం. చేతికింది వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. కుళ్లిన పంటలు చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరద నుంచి బయటపడుతున్న పంటలను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మళ్లీ వరద ముప్పు పొంచి ఉందన్న వార్తలతో ఆందోళన చెందుతున్నారు. ఇంకా కొన్ని లంకలు నీటిలోనే ఉన్నాయి. నీటి మధ్య ఉన్న నివాసాల నుంచి బయటకు రాలేక అక్కడ ఉండలేక పలువురు అల్లాడుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సాయం సక్రమంగా అందడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 


తెనాలి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): వరద తగ్గింది. అయితే పంటలు మాత్రం ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఆ నీరు బయటకు పోయేదెప్పుడో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికంది వచ్చిన పంట.. తమ కష్టాలు తీర్చుతుందని ఆశలు పెట్టుకున్న వారు కుళ్లిపోయి.. దుర్గందం వెదజల్లుతూ కనిపిస్తున్న పంటలను చూసి బోరున విలపిస్తున్నారు. రూ.లక్షలు పెట్టుబడులుపెట్టి పండించిన పంట పనికిరాకుండా పోవటంతో మరికొందరు రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంటను దక్కించుకోవాలని కొందరు రైతులు ఇంజన్లు పెట్టి నీటిని పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ వరద పెరుగుతుందన్న వార్తలతో ఆందోళన చెందుతున్నారు. మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో పంటలు బయటపడ్డాయి. ఊట దశలో ఉన్న పసుపు  పంట భూమిలోనే దుంప కుళ్లిపోతోంది. దీంతో పంట పనికిరాకుండా పోతుందని సాగుదారులు వాపోతున్నారు. ఇక కూరగాయలైతే కుళ్లిపోయి ఉన్నాయి. పసుపు ఆకులు బురదతో నిండిఉన్నా కొంతవరకు బయటకు బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే లోపల పనికిరావని, పంట పూర్తిగా నష్టపోయినట్టేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి పిలకతోటలు కుళ్లిపోతున్నాయి. మొవ్వు మునగటంతో ఆకులు పండిపోయి, చెట్లు నీటిలోనే వాలిపోతున్నాయి. చేతికి అందివచ్చిన అరటి పడిపోతుండటంతో పక్వానికి రాకున్నా వరద నీటిలోనే అతికష్టంగా గెలలను ఒడ్డుకు చేర్చుకుని తెగనమ్ముకోవాల్సి వస్తుంది.


కునుకు లేకుండా చేస్తోన్న వరద

వారం రోజులుగా వరద దోబూచులాడుతూ లంకగ్రామాల ప్రజలను కంటిపై కునుకులేకుండా చేస్తోంది. శనివారం సాయంత్రానికే ప్రకాశం బ్యారేజి దగ్గర 5,02,000 క్యూసెక్కులకు తగ్గిన వరద మళ్లీ ఆదివారం ఉదయానికి 5,42,000 వేలకు పెరిగి, రాత్రికి 6,15,000 క్యూసెక్కుల దగ్గర కొనసాగుతోంది. దీంతో శనివారం బయటపడిన పంటలు కొన్ని మళ్లీ మునుగుతుండటంతో రైతుల్లో ఆందోళన పెరిగిపోతోంది. భట్టిప్రోలు మండలంలో వరద కాస్త తగ్గినా, పంటలు మళ్లీ మునుగుతున్నాయి.  


నీటి మధ్యనే నివాసాలు.. కష్టాలు

భట్టిప్రోలు మండలంలోని పెదలంక, పెసర్లంక, చింతమోటు, మధ్యగూడెం, పల్లెపాలెం, కొల్లూరు మండలంలోని జువ్వలపాలెం, కిష్కింధపాలెం, గుంటూరుగూడెం వంటి మరికొన్ని గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఈ గ్రామాల్లో మెరకల్లో ఉన్న ఇళ్లు శనివారం రాత్రి బయటపడ్డాయి. అయితే ఆదివారం ఉదయానికి వరద రావడంతో మళ్లీ ముంపునకు గురయ్యాయి. ముంపులోనే ఉన్న భట్టిప్రోలు, కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో మాత్రం సహాయక చర్యలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. శనివారం మంత్రులు పర్యటించిన లంక గ్రామాలకు మినహా మిగిలిన గ్రామాల్లో బియ్యం, కందిపప్పు అందలేదు. పంపిణీ చేసిన గ్రామాల్లో కూడా కూడా వివక్ష చూపుతున్నారని పలువురు ఆరోపించారు. కొల్లూరు మండలం పెసర్లంక, పెదలంక వంటి మరికొన్ని గ్రామాలకు నేటికీ తాగునీటి ప్యాకెట్లు కూడా అందించలేదని ప్రజలు వాపోతున్నారు. వ్యాధులు ప్రభలుతున్న పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న నీటిని తాగలేకపోతున్నామని చెబుతున్నారు. కొల్లూరు నుంచి లంక గ్రామాలకు వెళ్లే రోడ్లు బయటపడటం, భట్టిప్రోలు మండలంలోని లంకల నుంచి వెల్లటూరుకు ట్రాక్టర్లపై వచ్చి పలువురు నిత్యావసరాలు తీసుకెళ్లేందుకు బారులు తీరారు. మళ్లీ వరద వస్తుందని సమాచారంతో ముందుగానే అవసరమైన సరకులు తీసుకుని వెళుతూ కనిపించారు. ఇళ్లలో నుంచి బయటకు రాలేనివారు మాత్రం గ్రామాలకే పరిమితమయ్యారు. 


అధికారుల సమీక్ష.. నేతల పర్యటన

కొల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ప్రత్యేకంగా సమీక్షించారు. భట్టిప్రోలు మండలం పెదలంకలో బాధితులకు బియ్యం, కందిపప్పు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, పామాయిల్‌ ప్యాకెట్లను జేసీ దినేష్‌కుమార్‌, తెనాలి సబ్‌కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌లు పంపిణీ చేశారు. ఇక అధికారుల బృందాలను గ్రామాలకు పంపి మునిగిన ఇళ్లను అంచనాలు వేయించే పనిలో నిమగ్నమయ్యారు. జనసేన పీఏసీ బృందం కూడా లంకగ్రామాల్లో పర్యటించింది. బాధితులు గోడు విని ప్రభుత్వ తీరుపైన, అధికారుల పనితీరుపై పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం దీనిని కూడా రాజకీయం చేయటం క్షమించరానిదని విమర్శించారు. 


14 వేల ఎకరాల్లో పంట నష్టం

తెనాలి, గుంటూరు డివిజన్లలో వరదలకు 14వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. మరో 100 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్టు గుర్తించినట్లు కలెక్టర్‌ ఆదివారం తెలిపారు. తెనాలి డివిజన్‌లోని కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో 10వేల ఎకరాల్లో అరటి, కంద, పసుపు, తమలపాకు, బొప్పాయి వంటి పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేశామన్నారు. అటు గుంటూరు డివిజన్‌లో మరో 4వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ప్రధానంగా పత్తి పంట దెబ్బతింది. కొల్లూరు, భట్టిప్రోలు, కొల్లిపర లంక గ్రామాల్లో నష్టం అంచనాలు మొదలుపెట్టామని కలెక్టర్‌ వెల్లడించారు. వరద తగ్గిన వెంటనే  అంచనా వేసేందుకు బృందాలను పంపుతామని, పూర్తి నష్టం నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని, పరిహారం త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-19T09:49:36+05:30 IST