ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ వివరాలు ఇవే..

ABN , First Publish Date - 2020-02-12T23:49:05+05:30 IST

ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు మోదీ-జగన్ మధ్య సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. రాజధాని మార్పు, శాసన మండలి రద్దుపై చర్చించినట్టు సమాచారం.

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ వివరాలు ఇవే..

ఢిల్లీ: ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు మోదీ-జగన్ మధ్య సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది. రాజధాని మార్పు, శాసన మండలి రద్దుపై చర్చించినట్టు సమాచారం. అలాగే పీపీఏల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కియా అంశాన్ని సీఎం జగన్‌ను మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆర్థిక సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.


అలాగే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చించారు. పోలవరానికి నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా మరోసారి సీఎం జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. వీటితో పాటు 3 రాజధానులు, శాసనమండలి రద్దు అంశాన్ని కూడా సీఎం జగన్.. మోదీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.


ఇదిలా ఉంటే ఓ వైపు 3 రాజధానులకు కేంద్రం అనుమతి లేదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు అంటుంటే.. అధికార పార్టీ నేతలు మాత్రం కేంద్రానికి తెలిసే అన్ని చేస్తున్నామని చెబుతున్నారు. కానీ కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో సందిగ్ధం నెలకొంది. 


మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా సీఎం జగన్ కోరినట్లు తెలుస్తోంది. కానీ అమిత్ షా మాత్రం శుక్రవారం అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ రేపు గనుక అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తే.. ఈ రాత్రికి ఢిల్లీలోనే జగన్ బస చేయనున్నారు. అలా కాకుండా శుక్రవారమే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తే మాత్రం ఈ రాత్రికి సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకుని మరోసారి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు.


ముఖ్యమంత్రి జగన్‌ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, గోరంట్ల మాధవ్‌ , మార్గాని భరత్‌, నందిగం సురేష్‌, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్‌, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-02-12T23:49:05+05:30 IST