కరోనా.. కన్నెర్ర
ABN , First Publish Date - 2020-04-28T09:43:50+05:30 IST
జిల్లాపై కరోనా కన్నెర్ర చేస్తోంది. వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది.

తాజాగా 22 పాజిటివ్ కేసులు
గుంటూరులో మరో ఆరుగురికి..
నరసరావుపేటలో 15 మందికి వైరస్
42 మందికి వైరస్‌తో వరవకట్ట విలవిల
నరసరావపేటలో రేపు, ఎల్లుండు లాక్‌డౌన్
పట్టణంలో పర్యటించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, జేసీ, ఎస్పీ
నరసరావుపేట వైద్యశాల లింక్‌తో కొండ్రముట్లలో ఓ మహిళకు పాజిటివ్
గుంటూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాపై కరోనా కన్నెర్ర చేస్తోంది. వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తోంది. నరసరావుపేటను వణికించేస్తోంది. వైరస్ వ్యాప్తితో నరసరావుపేటలోని వరవకట్ట అనే చిన్న ప్రాంతం విలవిలలాడుతోంది. జిల్లాలో సోమవారం మరో 22 మందికి పాజిటివ్‌గా అధికారులు ప్రకటించారు. ఇందులో 15 కేసులు నరసరావుపేటలోనే ఉన్నాయి. దీంతో నరసరావుపేటలో ఇప్పటి వరకు 64 మందికి వైరస్ వచ్చినట్లు తేలింది. గుంటూరు సంగడిగుంటలో ముగ్గురు, ఆనందపేటలో ఒకరు, కుమ్మరబజారులో ఒకరు, యానాది కాలనీలో ఒకరు ఈ వ్యాధిబారిన పడ్డారు. 22 కేసుల్లో 21 కేసులు ఇప్పటికీ ఈ వ్యాధి ప్రబలి ఉన్న ప్రాంతాల్లోనే తిరిగి ఉత్పన్నం కాగా కొత్తగా ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఓ మహిళకు కరోనా సోకింది. కాగా రాష్ట్ర బులిటెన్‌లో కొత్త కేసులు 22 అయినప్పటికీ అధికారిక ప్రకటనలో ఒకరిపేరు డబుల్ ఎంట్రీ కావడంతో 23గా తెలిపారు.
కొండ్రముట్లలో మహిళకు
ఈపూరు: మండలంలోని కొండ్రముట్లలో 50 ఏళ్ల మహిళకు కరోనా పాజిటీవ్‌గా వైద్యాధికారులు సోమవారం నిర్ధారించారు. నరరావుపేటలోని ప్రవేటు వైద్యశాలలో కుమారుడికి వైద్యం చేయిస్తూ అక్కడే ఉండి తగ్గిన తరువాత ఇంటికి వచ్చారు. ఆ ఆసుపత్రిలో కరోనా పాజిటీవ్ కేసులు బయట పడడంతో అక్కడ చికిత్స పొందిన వారి వివరాలు తెలుసుకుని శనివారం కొండ్రముట్లలోని ఆ మహిళ ఇంట్లోని వారి రక్త నమూనాలు పరిక్షలకు పంపారు. వారిలో ఇంటిపెద్ద అయిన మహిళకు పాజిటీవ్ అని వచ్చినట్లు వైద్యాధికారి నాగేంద్రబాబు తెలిపారు. ఆ మహిళను గుంటూరు ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు. పాజిటీవ్ వచ్చిన మహిళ మిరప కోతలకు, ఉపాధి పనులకు వెళ్లడంతో ఆమెతో కలిసి పనికి వెళ్లిన గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా డ్వామా పీడీ, నోడల్ అధికారి శ్రీనివాసరెడ్డి, తహసీల్దారు కోటేశ్వరరావు నాయక్, ఎంపీడీవో ప్రసాదరావు, రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ సింగయ్యలు గ్రామాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండ్రముట్ల, బోడెపూడివారిపాలెం, కొచ్చర్ల గ్రామాలలో ఉపాధి పనులు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వృద్ధురాలికి నెగిటివ్
తెనాలి అర్బన్: అంగలకుదురు వద్ద వలంటీర్ నమోదులో పాజిటివ్ వచ్చిన వృద్ధురాలికి గుంటూరులో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఆమెకు ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ రాగా ఆమె భర్తకు నెగిటివ్ వచ్చింది. దీంతో పీసీఆర్ పరీక్షకు ఎన్నారై ఆసుపత్రికి పంపగా, ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. దీంతో తెనాలివాసులు ఊపిరిపీల్చుకున్నారు.
స్వాబ్ రిపోర్టులు నేడు వెల్లడి
రెంటచింతల: నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన బంధువులు 20 మంది నుంచి సేకరించిన స్వాబ్ టెస్ట్‌ల రిపోర్టు మంగళవారం వెల్లడించనున్నట్లు పీహెచ్‌సీ డాక్టర్ హుస్యానాయక్ చెప్పారు.