భూములివ్వడమే నేరమా?

ABN , First Publish Date - 2020-05-10T06:57:35+05:30 IST

రాజధాని అమరావతిని ఇక్కడి నుంచి తరలిస్తామన్న వైసీపీ ప్రభుత్వం ప్రకటనతో ఆవేదన చెందిన ఇప్పటికే 64 మంది చనిపోయారు.

భూములివ్వడమే నేరమా?

అమరావతి రాజధాని కోసం పోయినవి ప్రాణాలు కాదా?

ప్రధాని ఎందుకు స్పందించరు..

ప్రశ్నించిన రైతులు, మహిళలు

144వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, మే 9(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని ఇక్కడి నుంచి తరలిస్తామన్న వైసీపీ ప్రభుత్వం ప్రకటనతో ఆవేదన చెందిన ఇప్పటికే 64 మంది చనిపోయారు. వారి ప్రాణాలకు విలువ లేదా..? అని ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని అధికార పార్టీ నేతలు ముంపు, కంపు, శ్మశానం అంటూ నాశనం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూమలు ఇవ్వటమేనా మేము చేసిన నేరం అని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. లాక్‌డౌన్‌ నిబంధనలతో ఎవరి ఇళ్లలో వారే ఉంటూ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వివిధ రూపాల్లో రైతులు నిరసనలు తెలిపారు.


విశాఖ ఘటన జరిగిన వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు హర్షనీయమన్న రైతులు.. 144 రోజులుగా ఆందోళనలు చేస్తున్న తమను ప్రధాని గుర్తించరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతవరం, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, మందడం, వెంకటపాలెం, తదితర 29 గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేయగా.. వీరికి మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక, బడేపురం తదితర గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ అమరావతి వెలుగు కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆర్పి కొవ్వొత్తుల, దీపాలు వెలిగించి సేవ్‌ అమరావతి,  సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2020-05-10T06:57:35+05:30 IST