చివరి వరకు పోరు

ABN , First Publish Date - 2020-04-26T09:32:57+05:30 IST

అమరావతే ఏకైక రాజధాని అని సీఎం జగన్మోహనరెడ్డి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పోరు ఆపేది లేదని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు.

చివరి వరకు పోరు

స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళనలు ఆపేది లేదు

130వ రోజు కొనసాగిన అమరావతి రైతుల నిరసనలు


గుంటూరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): అమరావతే ఏకైక రాజధాని అని సీఎం జగన్మోహనరెడ్డి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు పోరు ఆపేది లేదని ఆ ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే సాగాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 130వ రోజుకు చేరాయి. రైతులు, మహిళలు, కూలీలు తమ ఇళ్లలోనే కూర్చొని మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రూపాలల్లో  నిరసన తెలిపారు. పెదపరిమి, తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, రాయపూడి, మందడం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, నీరుకొండ తదితర 29 రాజధాని గ్రామాల్లో రైతులు ఎవరి ఇళ్లలో వారు ఇంట్లో కూర్చొని నిరసన ప్రదర్శనలు చేశారు.


పొన్నెకల్లులో వరుసగా శనివారం ఏడవ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. మహిళలు మాస్కులు తయారు చేసి పంపిణీ చేశారు. రాత్రి 7.30 గంటలకు ఇళ్లలో విద్యుత్‌ ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు. హైకోర్టుకు శుక్రవారం ప్రభుత్వ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) రాజధానిని విశాఖపట్నంకు ఇప్పుడు తరలించటం లేదని మాత్రమే చెప్పారని ఇది తాత్కాలిక ఉపశమనమేనని జేఏసీ నేత కె.శ్రీనివాస్‌ అన్నారు. 


Updated Date - 2020-04-26T09:32:57+05:30 IST