ఈ సారైనా అమ్మఒడి లబ్ధి అందుతుందా..?

ABN , First Publish Date - 2020-12-19T05:41:41+05:30 IST

జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 7.81 లక్షల వరకు ఉంది.

ఈ సారైనా అమ్మఒడి లబ్ధి అందుతుందా..?

గత ఏడాది అర్హత ఉండీ అందుకోలేకపోయిన 1.50 లక్షల మంది 

ఈ సంవత్సరమైనా అందుతుందో.. లేదోనన్న అనుమానాలు

లక్షా నాలుగు వేల రేషన్‌కార్డుల తొలగింపు..

దీంతో తగ్గనున్న లబ్ధిదారుల సంఖ్య

దరఖాస్తు పంపేందుకు ప్రైవేటు యాజమాన్యాల ఫీజు మెలిక


ఈ సారైనా మాకు అమ్మఒడి లబ్ధి అందుతుందా..? జిల్లాలో ఇంచుమించు లక్షన్నర మంది తల్లుల సందిగ్ధం ఇది..! రెండో విడత అమ్మఒడి నగదు జమ చేసేందుకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసింది. తొలి విడతలో ప్రభుత్వం చూపించిన సాంకేతిక కారణాలతో  లక్షన్నర మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకొన్నా ఉపయోగం లేకుండా పోయింది. మరి కొద్ది రోజుల్లోనే రెండో  ఏడాది అమ్మఒడి పథకం నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అర్హుల జాబితా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.   


గుంటూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 7.81 లక్షల వరకు ఉంది. వీరిలో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నారు. గత ఏడాది 3.90 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో మాత్రమే రూ.15 వేల వంతున నగదుని ప్రభుత్వం జమ చేసింది. సుమారు 68,150 మందికి సంబంధించి బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, రేషన్‌కార్డు, ఆధార్‌ నెంబర్లు తప్పుగా నమోదయ్యాయంటూ వారికి జమ చేయలేదు. దీని కోసం సంబంధిత విద్యార్థుల తల్లులు గ్రామ/వార్డు సచివాలయాలు, ఎంఈవో ఆఫీసుల చుట్టూత ప్రదక్షిణలు చేశారు. వారిలో కొద్దిమందికి మాత్రమే ఆ తర్వాత నగదు జమ చేశారు. కాగా 1,00,389 మంది తల్లులకు సంబంధించి వారి కుటుంబాల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉన్నారని, కరెంటు బిల్లు ఆరునెలల సగటు 300 యూనిట్లు దాటిందని, ఇళ్లు, పొలాలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల పిల్లలున్నారని, సొంత నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారని కారణాలు పేర్కొంటూ నిలుపుదల చేశారు. వీరిలో చాలామంది అర్హులున్నా సాంకేతిక కారణాలతో అనర్హులుగా మారిపోవాల్సి వచ్చింది విద్యుత్‌ బిల్లుల విషయంలో రుజువు పత్రాలు తీసుకొచ్చి నివేదించినా ఫలితం లేకపోయింది. నాలుగు చక్రాల వాహనం లేదని సర్టిఫికేట్‌లు తెచ్చి ఇచ్చినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు.  


రేషన్‌ కార్డుల తొలగింపుతో...

ఇదిలావుంటే ఈ నెల ప్రారంభంలో జిల్లా వ్యాప్తంగా లక్షా 4 వేల మంది రేషన్‌కార్డులను ప్రభుత్వం తొలగించింది. వారిలో గత ఏడాది అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారు. దీంతో ఈ ఏడాది వారికి అమ్మఒడి నగదు రాకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తమ కార్డులను ఏ కారణాలతో తొలగించారో తెలుసుకొని వాటిని సరి చేసుకొనేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకొంటున్నారు.  అమ్మఒడి పథకానికి ఈ నెల 19వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. 20వ తేదీన అర్హుల జాబితాని ప్రకటిస్తారు. 20 నుంచి 24వ తేదీ మధ్యన తప్పుల సవరణకు అవకాశం కల్పించారు. 26న అమ్మఒడి లబ్ధిదారుల తుది జాబితాని విడుదల చేస్తారు. కాగా ఇప్పటివరకు ఆన్‌లైన్‌ క్లాసులే నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు పిల్లల వద్ద ఫీజులు వసూలు చేసేందుకు అమ్మఒడి పథకం మెలిక పెట్టారు. ఫీజు చెల్లిస్తేనే అమ్మఒడి పథకానికి దరఖాస్తులు పంపుతామని స్పష్టం చేసస్తున్నారు. దీంతో చాలామంది అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. 


అమ్మఒడి సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌లు

 అమ్మఒడి పథకంలో సమస్యలు పరిష్కరించడానికి  అన్ని డివిజన్స్‌లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ పథకం వర్తింపచేయడానికి ఫీజులు చెల్లించాలని ఒత్తిడిచేసే ప్రైవేటు స్కూల్స్‌పై కూడా ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. ఈనెల 19లోగా చైల్డ్‌ ఇన్ఫో అప్‌డేట్‌ చేసి అమ్మఒడికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని  పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-19T05:41:41+05:30 IST