అమ్మఒడి నగదుపై మరో కొత్త కోణం తెరపైకి!

ABN , First Publish Date - 2020-02-12T14:46:58+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అమ్మఒడి పథకం ద్వారా..

అమ్మఒడి నగదుపై మరో కొత్త కోణం తెరపైకి!

అమ్మఒడి నగదుపై ‘ప్రైవేటు’ కన్ను

రూ. 1,500 అదనపు ఫీజు చెల్లించాలని ఒత్తిడి

అదేమంటే కన్ఫర్మేషన్‌  ఫీజు అంటోన్న పలు యాజమాన్యాలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అమ్మఒడి పథకం ద్వారా ప్రతీ విద్యార్థి తల్లికి చెల్లించిన రూ. 15 వేల నగదులో రూ. వెయ్యి తిరిగి ఇవ్వమని సీఎం జగన్‌ చేసిన ఆదేశాలను ప్రైవేటు స్కూళ్ల  యాజమాన్యాలు వేరే రూపంలో అమలు చేస్తోన్నాయి. అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి విద్యార్థి ఫీజుతో పాటు అదనంగా రూ. 1,500 చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ పథకం అమలుని ముందే పసిగట్టి తొలుత కన్‌ఫర్‌మేషన్‌ ఫీజు అని కొత్త పేరు చెప్పి ముందుగానే వారి ఖాతాలో వేసుకొన్నాయి. అప్పట్లో కన్‌ఫర్‌మేషన్‌ ఫీజుని వార్షిక ఫీజులో మినహాయిస్తామని చెప్పిన యాజమాన్యాలు నేడు మాట తప్పుతోన్నాయి. కొద్ది రోజుల నుంచి నిత్యం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీ పిల్లల ఫీజు బకాయి ఇంకా ఉందని వెంటనే వచ్చి చెల్లించమని ఆదేశిస్తున్నాయి. 


ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో పలు ప్రైవేటు విద్యా సంస్థలు కన్‌ఫర్‌మేషన్‌ ఫీజుని వసూలు చేశాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు ఫీజులు చెల్లించేందుకు వెళ్లిన సమయంలో రాయితీ గురించి మాట్లాడటానికి ముందు కన్‌ఫర్‌మేషన్‌ ఫీజు చెల్లించాలని కోరాయి. రూ. 1,500 చెల్లిస్తేనే రాయితీ గురించి తాము మాట్లాడగలమని, చెల్లించిన ఆ మొత్తాన్ని ఫీజులో సర్దుబాటు చేస్తామని హెచ్‌ఎంలు మాయమాటలు చెప్పారు. దాంతో నిజమే అని నమ్మిన విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు రాయితీ మాట్లాడుకొని ఆ మేరకు రెండు, మూడు దఫాలుగా చెల్లించారు. అయితే గత కొద్ది రోజుల నుంచి వారికి ఫోన్లు చేస్తోన్న పాఠశాలల యాజమాన్యాలు మీ పిల్లల ఫీజు బకాయి ఇంకా ఉందని చెబుతోండటంతో వారు విస్తుబోతోన్నారు. 


ఎవరికైతే అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి జరిగిందో వారిపై ఎక్కువగా ఒత్తిడి చేస్తోన్నారు. వారం వ్యవధిలో రూ. 1,500 తీసుకొచ్చి చెల్లించాలని ఒత్తిడి పెంచుతోన్నారు. నిత్యం పిల్లల డైరీలలో ఫీజు బకాయి నోటీసులను అతికించి పంపిస్తోన్నారు. ఇలా కన్‌ఫర్‌మేషన్‌ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అడిగే నాథుడే కరువయ్యాడు. విద్యాశాఖ అధికారులు ఈ అక్రమ ఫీజు వసూళ్లని పట్టించుకోకపోతుండటంపై పలురకాల సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఇదిలావుంటే సీఎం జగన్‌ రూ. వెయ్యిని పాఠశాలలకు తిరిగి ఇవ్వాలని చెప్పడంతోనే ఇదంతా జరుగుతోందని విద్యార్థుల తల్లులు చెబుతోన్నారు. 

Updated Date - 2020-02-12T14:46:58+05:30 IST