చెప్పిందొకటి.. చేసేదొకటి
ABN , First Publish Date - 2020-04-21T07:06:23+05:30 IST
‘రాష్ట్ర భవిష్యత్తుతో పాటు, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి తాతతండ్రుల నాటి భూములు ఇచ్చాం. నాడు చెప్పింది ఒకటి.. నేడు చేస్తోంది మరొకటి. మా జీవితాలతో ఆడుకోవద్దు..’ అంటూ అమరావతి ప్రాంత రైతులు...

- మా జీవితాలతో ఆడుకోవద్దంటూ ధ్వజం
- 125వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు
తుళ్లూరు/గుంటూరు, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర భవిష్యత్తుతో పాటు, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి తాతతండ్రుల నాటి భూములు ఇచ్చాం. నాడు చెప్పింది ఒకటి.. నేడు చేస్తోంది మరొకటి. మా జీవితాలతో ఆడుకోవద్దు..’ అంటూ అమరావతి ప్రాంత రైతులు సోమవారం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు సోమవారానికి 125వ రోజుకు చేరాయి. పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, రాయపూడి, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నీరుకొండ, తదితర గ్రామాల్లో మహిళలు, రైతులు నిరసనలు తెలిపారు. పత్రికల్లో ఫొటోలు వచ్చాయని పెదపరిమిలో 23 మందికి నోటీసులు ఇచ్చారని అయితే పేదలకు సరుకులు పంపిణీ పేరుతో మినీ సభలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేపైౖ కేసులు పెట్టరా అని మహిళలు ప్రశ్నించారు. సత్తెనపల్లికి చెందిన మన్నవ శారదాదేవి, వెంకట్రామయ్య రైతులతో కలిసి దీక్ష చేశారు. మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తన నివాసం నుంచి తెల్ల పావురాలు ఎగరవేసి నిరసన తెలిపారు. గుంటూరులో రావిపాటి సాయికృష్ణ, డాక్టర్ రాయపాటి శైలజ, షేక్ జిలానీలు జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట దీపాలను వెలిగించి నిరనస తెలిపారు.