అమరావతిపై కపట ప్రేమ

ABN , First Publish Date - 2020-10-07T15:16:00+05:30 IST

రాజధాని అమరావతిపై కపట ప్రేమ నటించి అధికారం రాగానే విషం చిమ్మారని రైతులు..

అమరావతిపై కపట ప్రేమ

మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా దీక్ష 

రైతులను స్టేషన్‌కు తరలించిన పోలీసులు

294వ రోజుకు 

చేరిన రాజధాని రైతుల ఆందోళనలు


గుంటూరు: రాజధాని అమరావతిపై కపట ప్రేమ నటించి  అధికారం రాగానే విషం చిమ్మారని రైతులు ఆవేదన వ్యకం చేశారు. అమరావతిని కొనసాగించాలంటూ చేస్తోన్న ఉద్యమం మంగళవారానికి 294వ రోజుకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అసభ్యకరంగా మాట్లాడటంపై తుళ్లూరు దీక్షా శిబిరం ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోసు విగ్రహం వద్ద నలుగురు రైతులు ఎండలో నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు అనుమతి లేదని సీఐ శ్రీహరిరావు అడ్డుకున్నారు.  పోలీసు జీపు ఎక్కేందుకు నిరాక రించిన రైతులను నడిపించుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో దీక్షా శిబిరంలోని మహిళలు జై అమరావతి అంటూ వారిని అనుసరించారు. రైతులను అవమానపరుస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న కృష్ణదాస్‌పై చర్యలు తీసుకోవాలని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు గంటల సేపు రైతులను స్టేషన్‌లోనే ఉంచారు. దొండపాడు, బోరుపాలెం, అనంతవరం, పెదపరిమి, మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, ఐనవోలు నేలపాడుల్లో దీక్షా శిబిరాలు కొనసాగాయి.  విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి రాజధాని 29 గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు, దళిత జేఏసీ సభ్యులు హాజరయ్యారు.  


సీఎం జగన్‌ ఢిల్లీ ఎందుకు వెళ్లారు : దేవినేని ఉమా

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారో బహిరంగపరచాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. మంగళవారం తుళ్లూరు దీక్షా శిబిరానికి వచ్చిన ఉమా మాట్లాడుతూ ప్రధానిని ఎందుకు కలిశారో చెప్పడంలేదని, దీంతో ఆయన కేసుల నుంచి బయట పడటానికి వెళ్లారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాజధాని ఉద్యమం మొదలు పెట్టి 300 రోజులకు చేరువవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అన్ని రాజకీయ పక్షాలు రాజఽధాని రైతుల పక్షాన ఉన్నాయన్నారు.  


అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో జరుగుతున్న రిలే దీక్షలు 294వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం వెనక్కు తీసుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.


తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం బొడ్డురాయి సెంటర్‌లో చేపట్టిన దీక్షలు 294వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ ప్రాణాలైనా అర్పిస్తాం.. అమరావతిని సాధిస్తామని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నినదించారు.   


మూడు రాజధానులపై ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తూ తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ రైతులు, మహిళలు మంగళవారం నిరసనలు కొనసాగించారు. రాజధాని నిర్మాణా నికి భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. ఇన్‌సైడ్‌ ట్రెడింగ్‌ జరిగిందని చెప్పిన ప్రభుత్వం వివరాలను బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  

Updated Date - 2020-10-07T15:16:00+05:30 IST