అమరావతిపై దృష్టి మరల్చడానికి కుయుక్తులు

ABN , First Publish Date - 2020-09-24T15:01:40+05:30 IST

అమరావతి రాజధాని విషయం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి జగన్‌ ప్రభుత్వం..

అమరావతిపై దృష్టి మరల్చడానికి కుయుక్తులు

281వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని విషయం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి జగన్‌ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందని రైతు లు ఆరోపించారు. పెదపరిమి, దొండపాడు, అనంతవరం, నెక్కల్లు, నేలపాడు, ఐనవోలు, తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం,వెలగపూడి, మందడం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం తదతర గ్రామాలలో అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని జరుగుతోన్న ఆందోళనలు బుధవారంతో 281వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానులని ప్రజల దృష్టిని అమరావతి నుంచి మరల్చాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అమరావతి ఉద్యమం ఆగదన్నారు. 


అమరావతి ఎక్కడకూ కదలదు  

అమరావతి ఎక్కడకు కదలదని, తరలిపోదని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన అనంతవరం, దొండపాడు పెదపరిమి, నేలపాడు దీక్షా శిబిరాలను సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాశ చెందకుండా ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.  


మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళగిరి మండలం యర్రబాలెం, కృష్ణాయపాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 281వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఎన్‌ నాగేశ్వరరావు, ఎం అశోక్‌, ఉమామహే శ్వరరావు, సీహెచ్‌ శ్రీనివాసరావు, సతీష్‌, ఎం సాంబశివరావు, శివయ్య, సుబ్బారావు ఎం బిందు, జ్యోతి, కుసుమ తదితరులు పాల్గొన్నారు. 


అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తాడేపల్లి మండలం పెనుమాకలో చేపట్టిన దీక్షలు 281వ రోజుకు చేరాయి. ఈ దీక్షలలో ఐకాస నాయకులు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, పఠాన్‌ జానీఖాన్‌, ఎం మాణిక్యాలరావు, దండమూడి ఉమామహేశ్వరరావు, సాబ్‌జాన్‌, ఎర్రపీరు, గుంటక సాంబిరెడ్డి, ముప్పెర సదాశివరావు, మన్నవ వెంకటేశ్వరరావు, ఎం తాతయ్య, గోగినేని నాగేశ్వరరావు, ఎం సుబ్బారావు, కళ్లం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


అమరావతి రైతులకు సంఘీభావంగా తాడికొండ మండలం మోతడక, పొన్నెకల్లు, నిడుముక్కల రైతులు దీక్షలు కొనసాగించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి అని నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రజల మనస్సులను అర్థం చేసుకొని పాలన చేస్తే మంచిదని హితవు పలికారు. 


అమరావతిని కాపాడుకోవాలి

రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ముప్పాళ్ల మండలం నార్నెపాడులో బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీపై ఉన్న వ్యతిరేకతతోనే వైసీపీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, సత్తెనపల్లి జేఏసీ కన్వీనర్‌ నరిశెట్టి వేణుగోపాల్‌, శారదాదేవి, రావిపాటి దేవేంద్రరావు, జెట్టి జగదీష్‌, వేమూరి వెంకటరావు, మన్నవ వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-24T15:01:40+05:30 IST