ఉద్యమంపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2020-08-20T13:25:03+05:30 IST

రాజధానిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్..

ఉద్యమంపై ఉక్కుపాదం

రాజధాని గ్రామాల్లో నిరసనలు

ముందస్తుగా నేతల అరెస్టు

శిబిరాలను ఖాళీ చేయించిన పోలీసులు

మాట్లాడే స్వేచ్ఛకూడా లేదా.. అంటూ రైతుల ఆగ్రహం


తుళ్లూరు, తాడికొండ(గుంటూరు): రాజధానిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్ మీటింగ్‌ కోసం సచివాలయానికి వెళుతున్న నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసులు పలువురు అమరావతి ఉద్యమ జేఏసీ నేతలను ముందు జాగ్రత్తచర్యగా అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కృష్ణా కరకట్ట, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు సహా సీఎం కాన్వాయి మార్గంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మందడంలో దీక్షా శిబిరంలో కూర్చున్న మహిళలను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.


అమరావతి కొనగాలని రాజధాని రైతులు, రైతుకూలీలు చేస్తున్న ఉద్యమం బుధవారం 246 వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, తుళ్ళూరు, రాయపూడి, వెలగపూడి, మందడం, అబ్బురాజుపాలెం, అనంతవరం తదితర గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో జేఏసీ ఆధ్వర్యాన రైతులు, రైతుకూలీలు ప్లకార్డులు చేతబూని నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని ఉండాలని, రాజధానిని మూడు ముక్కలు చేసే ఆలోచన ప్రభుత్వం ఇప్పటికైనా విరమించుకోవాలని కోరారు. అమరావతిని ఒకే రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. 


పోలీసుల అదుపులో జేఏసీ నేతలు

ముఖ్యమంత్రి జగన్‌ క్యాబినెట్‌ మీటింగ్‌కు వెళుతున్న నేపథ్యంలో పోలీసులు పలువురు అమరావతి ఉద్యమ జేఏసీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. టీడీపీ నేత గాదె శ్రీనివాసరావు, కూనపరెడ్డి రమేష్‌, సనక బుజ్జిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి, అనంతరం విడుదల చేశారు. దీనిపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో నల్లబెలూన్‌లు ఎగరవేయటానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు సిద్ధం అయ్యారు. దీంతో ఆ పార్టీ నేత చిలకా విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని తుళ్లూరు స్టేషన్‌లో ఉంచారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నాయకులు కొమ్మినేని సురేష్‌, వలపర్ల నరసింహా, కంచర్ల గాంధీ, నండూరి విజయ్‌ పాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


Read more