జై అమరావతి.. రాజధాని గ్రామాల్లో మిన్నంటుతున్న నినాదాలు

ABN , First Publish Date - 2020-03-19T07:50:12+05:30 IST

జై అమరావతి... సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదాలు రాజధాని గ్రా మాల్లో మిన్నంటు తున్నాయి. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ 92వ రోజు

జై అమరావతి.. రాజధాని గ్రామాల్లో మిన్నంటుతున్న నినాదాలు

తుళ్లూరు/ మంగళగిరి క్రైమ్‌/ తాడికొండ, మార్చి 18: ‘ జై అమరావతి... సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నినాదాలు రాజధాని గ్రా మాల్లో మిన్నంటు తున్నాయి. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ 92వ రోజు బుధవారం ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి.  వెలగపూడి, మందడం, తుళ్లూరు, రాయపూడి, పెదపరిమిలో రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందేమోనని విద్యాసంస్థలకు ప్ర భుత్వం సెలవులు ప్రకటించింది. ఆ వంకతో రైతుల దీక్షా శిబిరాలను ఖాళీ చేయించాలని కూడా కుట్రచేస్తుందని జేఏసీ నేతలు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  భూములు త్యాగాలు చేసిన రైతులను, ఇక్కడ బతికే రైతు కూలీలను మానసికంగా ఏడు నెలల క్రితమే ఈ ప్రభుత్వం చంపేసింది. దీనికన్నా కరోనా వైరస్‌ మాకు పెద్ద ఎఫెక్టు కాదని, శిబిరాలు కొనసాగుతాయని మహిళలు, రైతులు, కూలీలు స్పష్టం చేస్తున్నారు. తుళ్లూరులో రైతులు 12 గంటలు నిరాహార దీక్ష చేశారు. వారికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్‌ నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. 


రాజధాని రైతులకు సీఎం వెన్నుపోటు: సీపీఐ

మంగళగిరి మండలంలోని యర్రబా లెం, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమ ర్రు గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 92వ రోజుకు చేరాయి.  యర్రబాలెం, కృష్ణాయ పాలెం రైతు రిలే నిరాహారదీక్షలను మంగళగిరి నియోజకవర్గ సీపీఐ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం కాశయ్య మాట్లాడుతూ... రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు సీఎం జగన్‌ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాజధాని ఉద్యమంలో పాల్గొనేవారిని భయభ్రాంతులకు గురి చేయాలనే దురుద్దేశంతో  దాదాపు 4వేల మంది రైతులపై వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం బాధాకరమన్నారు. నియోజకవర్గ టీడీపీ పూర్వ ఇన్‌చార్జి గంజి చిరంజీవి సంఘీభావం తెలిపారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు ఆకుల జయసత్య,  ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ తాడిబోయిన పద్మారావు, జేఏసీ నాయకులు ఎ.ఉమామహేశ్వరరావు, వెలిమిచర్ల శివన్నారాయణ, పలువురు రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు. నవులూరు రైతు రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసన తెలిపారు. నిడమర్రులో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షల్లో నీరుకొండ, కురగల్లు, బేతపూడి గ్రామాలకు చెందిన పలువురు రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు. 


రాజధాని ఎక్కడికీ తరలివెళ్లదు: డాక్టర్‌ శైలజ

తాడికొండ అడ్డరోడ్డులో 75 రోజుల నుంచి మూడు రాజధా నులకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళ జేఏసీ నాయకురాలు డాక్టర్‌ రాయపాటి శైలజ బుధవారం దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలి పారు. రాజధాని అమరావతిలోనే కొనసాగతుందని... ఎక్కడికీ తరలివెళ్లదని ఆమె పేర్కొన్నారు. రాజధాని ఇక్కడే ఉండేందుకు వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు. ప్రపంచానికి కరోనా వైరస్‌ సోకినట్లు, రాష్ట్రానికి జగన్‌ వైరస్‌ సోకిందని అన్నారు. మామాలు వైరస్‌కు, ప్రాణాంతక వైరస్‌కు వ్యత్యాసం తెలియకుండా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం ప్రతి దానికి కులం, పార్టీ అంటూ ముద్రవేస్తు న్నారని మండి పడ్డారు. దీక్షా శిబిరంలోని మహిళలకు కరోనా వైరస్‌ దరిచేరకుండా ఉండటానికి  డాక్టర్‌ శైలజ హోమియో మందులను పంపిణీచేశారు. 

Updated Date - 2020-03-19T07:50:12+05:30 IST