పేదలకు శాపంగా సర్కార్‌ విధానాలు : ఆలపాటి

ABN , First Publish Date - 2020-12-12T05:28:57+05:30 IST

మోసపు వాగ్ధానాలతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ దగా చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

పేదలకు శాపంగా సర్కార్‌ విధానాలు : ఆలపాటి
ప్రదర్శన నిర్వహిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి తదితరులు

తెనాలి టౌన్‌, డిసెంబరు 11 : మోసపు వాగ్ధానాలతో అధికారం చేపట్టిన  ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతూ దగా చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఉదయం ప్రజలపై పెనుభారంగా మారబోతున్న పన్నుల పెంపుదలను విరమించుకోవాలని, రక్షిత తాగునీరు పథకాన్ని వెంటనే అమలు చేయాలని, లోకల్‌ పన్నులు రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, వివిధ రకాలైన ప్లకార్డులు చేతపట్టి ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేశారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు ఇంత వరకు పంట నష్టపరిహారాన్ని చెల్లించకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఖరిని తెలుపుతుందన్నారు. రైతులకు ఉచిత బీమా సౌకర్యం కలుగజేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా, బీమా చెల్లింపులు లేవన్నారు. మరో వైపు నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వం అదుపు చేయడం చేతకాక చోద్యం చూస్తుందన్నారు. పన్నుల రూపంలో మూడింతలు వడ్డన చేసి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని, మద్యాన్ని మాత్రం రాష్ట్రంలో ఇంటింటికి డోర్‌ డెలివరి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్లాబ్‌లు పెట్టి విద్యుత్‌ బిల్లుల్ని రెండు రెట్లు పెంచేసిన జగన్మోహనరెడ్డి పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచారన్నారు.  తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 54 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, వైసీపీ వచ్చాక 10 లక్షలు తీసి వేశారన్నారు. దీనికి తోడు లోకల్‌ టాక్స్‌ల పేరుతో ప్రజలపై పెనుభారాన్ని మోపి ఆర్థికంగా పతనం చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు, నాయకులు గడవర్తి సుబ్బయ్య, ఖుద్దూస్‌, మాదల కోటేశ్వరరావు, మహేష్‌, కావేటి సామ్రాజ్యం, రేణుక, రమాదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:28:57+05:30 IST