అక్రమాలు అన్యాయాలే వైసీపీ పాలన: ఆలపాటి
ABN , First Publish Date - 2020-11-13T06:39:25+05:30 IST
అక్రమాలు, అన్యాయాలతోనే వైసీపీ పాలన సాగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు.
తెనాలి అర్బన్, నవంబరు 12 : అక్రమాలు, అన్యాయాలతోనే వైసీపీ పాలన సాగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. మైనారిటీలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నిరసిస్తూ గురువారం రాత్రి వహాబ్ చౌక్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆల పాటి మాట్లాడుతూ ఈ సంఘటనను ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తుందనే దానికి ఎఫ్‌ఐఆర్ నిదర్శనమన్నారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే కీచకులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తూ సలాం ఆత్మహత్య నుంచి బయట పడేందుకు పలు రకాలుగా ప్రయత్నిస్తోందన్నారు. అమరావతి దళిత రైతులపై కేసులు పెడుతున్న పోలీసులు సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ సైతం ప్రశ్నిస్తున్నా ఏమీ పట్టడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ నాయకులు అన్నాబత్తుని జయలక్ష్మి, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.