‘నీమీద నాకు ఎటువంటి ఫీలింగ్స్‌ లేవు.. నిన్ను పెళ్ళి చేసుకోను..’

ABN , First Publish Date - 2020-10-13T16:39:37+05:30 IST

తనను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేసి నగ్నచిత్రాలను సోషల్‌ మీడియాలో పెడతానని..

‘నీమీద నాకు ఎటువంటి ఫీలింగ్స్‌ లేవు.. నిన్ను పెళ్ళి చేసుకోను..’

ప్రేమ పేరుతో నయవంచన..

పెళ్ళి చేసుకుంటానంటూ యువతితో శారీరక సంబంధం

నగ్నచిత్రాలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపు


గుంటూరు: తనను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేసి నగ్నచిత్రాలను సోషల్‌ మీడియాలో పెడతానని ఓ యువకుడు వేధిస్తున్నట్లు బాధితురాలు సోమవారం అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అడవి తక్కెళ్లపాడులోని న్యూ రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉండే బాధితురాలు బీటెక్‌ పూర్తి చేసింది. ఆమెకు కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన బురుగుపల్లి మోహన్‌గణేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తాను గుజరాత్‌లో ఉద్యోగం చేస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. జనవరి 23వ తేదీన విజయవాడలోని ఓ హోటల్‌కు తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు.


ఆ తరువాత ఆమెతో మాట్లాడటం క్రమంగా తగ్గించాడు. అదేమంటే నీమీద నాకు ఎటువంటి ఫీలింగ్స్‌ లేవని, నిన్ను పెళ్ళి చేసుకోనని చెప్పాడు. గట్టిగా అడిగితే  ఏమి చేసుకుంటావో చేసుకోమని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఎవరికైనా చెబితే నీ నగ్న చిత్రాలను ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. దీనిపై దిశా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు నల్లపాడు స్టేషన్‌కు వెళ్ళాలని చెప్పగా అక్కడకు వెళ్ళానన్నారు. వారు విజయవాడ వెళ్ళాలని సూచించడంతో అక్కడకు వెళ్ళామన్నారు. అక్కడికి వెళితే గుంటూరు వెళ్ళమని విజయవాడ పోలీసులు సూచించారన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. 


మరో యువతి..

ప్రేమిస్తున్నానని వెంటపడి మోసం చేయటమే గాక ఇద్దరం కలసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని గుంటూరుకు చెందిన పత్తి మల్లాంజనేయులు బెదిరిస్తున్నాడని విజయ పురిసౌత్‌కు చెందిన ఓ యువతి సోమవారం రూరల్‌ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఆమె గతంలో గుంటూరు నగరంలోని ఓ విద్యాసంస్థలో పనిచేసే సమయంలో నగరానికి చెందిన మల్లాంజనేయులుతో పరిచయం అయింది. అయితే అతనికి గతంలోనే వివాహమైనట్టు తనకు ఆలస్యంగా తెలిసిందని బాధితురాలు వాపోయింది. అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటున్నానని పేర్కొంది. ఈ క్రమంలో ఇటీవల బాధిత యువతికి నిశ్చితార్ధం నిర్ణయించారు.


ముందురోజు యువకుడు ఇంటికి వెళ్ళి వారిరువురూ దిగిన ఫొటోలు చూపాడు. దీంతో ఆమె నిశ్చితార్ధం రద్దయింది. దీంతో బాధితురాలు విజయపురిసౌత్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు పట్టించుకోలేదు. అయినా వేధింపులు మానుకోకుండా ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరిస్తుండటంతో బాధితురాలు సోమవారం రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్న మల్లాంజనేయులుపై తగు చర్యలు తీసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపాలని బాధితురాలు వేడుకొంది. 

Updated Date - 2020-10-13T16:39:37+05:30 IST