పల్లెలపై పడగ
ABN , First Publish Date - 2020-06-25T09:51:29+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి తగ్గడం లేదు. రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో పలు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కేసులు

గ్రామాలకు పాకిన కరోనా
జిల్లాలో 70 మందికి పాజిటివ్
వెయ్యి దాటేసిన కరోనా కేసులు
తాడేపల్లిలో 12 పాజిటివ్ కేసులు
గుంటూరు నగరంపై కరోనా కన్నెర్ర
రోజురోజుకు విస్తరిస్తోన్న వైరస్‌తో గగ్గోలు
మంగళగిరి ఎంపీడీవో కార్యాలయంలో కరోనా
తెనాలి, చిలకలూరిపేటల్లో ఇద్దరు మృతి
ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్, జూన్ 24: జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి తగ్గడం లేదు. రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో పలు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. క్రమంగా కొవిడ్-19 పల్లెకు పాకడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో కరోనా తొలి కేసు నుంచి సరిగ్గా 90 రోజులకు బాధితుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటేసింది. జిల్లావ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే ఏకంగా 70 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 27 కేసులు, తెనాలిలో 13, నరసరావుపేటలో 3, మాచర్లలో 2, మంగళగిరిలో 6, తాడేపల్లిలో 12 కేసులు, వివిధ క్వారంటైన్ సెంటర్లలో 7 కేసులు నమోదయ్యాయి. గుంటూరు పరిధిలోని డీఎస్ నగర్, వెంకటరమణ కాలనీ, ఆర్‌టీసీ కాలనీ, కేవీపీ కాలనీ, గుండారావు పేట, నల్లచెరువు, బృందావన్ గార్డెన్స్, లాలాపేట, శ్యామలానగర్, చౌడవరంలో ఒక్కొక్క కేసు, పట్టాభిపురంలో 2, సంగడిగుంటలో 3 కేసులు నమోదయ్యాయి.
కాటూరి మెడికల్ కళాశాల క్వారెంటైన్‌లో 3 కేసులు, అంకిరెడ్డిపాలెం క్వారంటైన్‌లో ఒక కేసు, ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చి గృహ నిర్బంధంలో ఉన్న ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. తెనాలి పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్ నుంచి తిరిగొచ్చి ప్రస్తుతం చిలువూరులో గృహ నిర్బంధంలో ఉన్న మరో వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. బాపట్ల పరిధిలోని గొల్లపాలెం, సత్తెనపల్లి, నంబూరు, కర్లపాలెం, నిజాంపట్నం, పెదనందిపాడు, రేవేంద్రపాడు, కనపర్రులో ఒక్కొక్క కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ నుంచి ఇటీవల తిరిగొచ్చి మంగళగిరిలో ఉన్న వ్యక్తికి కొవిడ్-19 సోకింది. కేఎల్‌యూ క్వారంటైన్‌లో మరో నలుగురికి వైరస్ సోకిట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. జిల్లాలో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. చిలకలూరిపేట సమీపంలోని బండమూడిలో 77 ఏళ్ళ వృద్ధుడు కరోనాకు గురై విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెనాలి సమీపంలోని పినపాడుకు చెందిన 81 ఏళ్ళ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
తాడేపల్లిలో రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. మహానాడు ప్రాంతంలో పాత కేసులకు సంబంధించి క్వారంటైనలో ఉన్న వారిలో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ ప్రాంతంలోనే ఓ ఏఎన్‌ఎంకు, ఆమె కుమారుడికి కరోనా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏయే ప్రాంతాల్లో ఆమె విధులకు హాజరయ్యారు, ఎంత మందిని కలిశారు అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మణిపాల్ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్న ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
మంగళగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఓ అటెండర్‌కు పాజిటివ్‌గా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. ఎర్రబాలెంలో ఉండే అటెండర్‌తో పాటు కుమారుడికి కూడా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్యాలయ పరిసరాలను క్రిమి సంహారక రసాయనాలతో పరిశుభ్రం చేశారు.
దుగ్గిరాల మండలం చిలువూరులో రెండ్రోజుల క్రితం ఛాతినొప్పితో ఓ మహిళ మణిపాల్‌కు వెళ్లగా ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారించారు. రేవేంద్రపాడులో ఇటీవల పాజిటివ్ వచ్చిన వ్యక్తి భార్యకు కూడా కరనా వచ్చింది. దీంతో వీరి కుటుంబసభ్యులను మంగళగిరి ఎన్నారైకు పంపారు.
నరసరావుపేట పట్టణంలో ఒకరికి, మండలంలోని ఉప్పలపాడులో మరొకరికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఉప్పలపాడు గ్రామంలో తొలి కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనారోగ్యంతో ఈ వ్యక్తి మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనాగా తేలింది.
తెనాలి పట్టణంలో ఒకరికి, రూరల్ మండల గ్రామాల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ నమోదైంది. పట్టణంలోని నాజరుపేటకు చెందిన ఓ మహిళా న్యాయవాది కొన్ని రోజులుగా రుచి, వాసన గ్రహించే శక్తి కోల్పోవడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నమోదైంది. తేలప్రోలులో పాజిటివ్ కేసులకు సన్నిహితంగా మెలిగిన మహిళకు పాజిటివ్‌గా తేలింది. నేలపాడుకు చెందిన టిప్పర్ డ్రైవర్‌కు పాజిటివ్ వచ్చింది. తెనాలిలో కేసుల సంఖ్య 42కి చేరింది.
నకరికల్లు మండలంలోని కుంకలగుంటలో రెండో కేసు నమోదైంది. హైదరాబాదు నుంచి వచ్చి కరోనా సోకిన వ్యక్తితో కలిసిన తిరిగిన యువకుడు కూడా కరోనా బారిన పడ్డాడు. మండలంలో కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది.
తాడికొండ తూర్పు బజారుకు చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారించారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఇతడు వైరస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో తహసీల్దార్ కుటుంబారావు, ఎస్‌ఐ సీహెచ్ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి పీ.శ్రీనివాసులరెడ్డి అప్రమత్తమై ఆ పరిసర ప్రాంతాలను కట్టడి చేశారు.
బాపట్లలో మరో రెండు కేసులు నమోదయ్యాయని ఏరియా వైద్యశాల వైద్యాధికారి భాస్కర్ తెలిపారు. క్యాన్సర్‌తో మణిపాల్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిల్లరగొల్లపాలేనికి చెందిన మహిళకు పాజిటివ్ వచ్చింది. ప్యాడిసన్‌పేటకు చెందిన వ్యక్తి ఒంగోలు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా పాజిటివ్ వచ్చింది.
సత్తెనపల్లిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలికి పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్న వారు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె నివాస ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ అశోక్‌బాబు, ఏఎన్‌ఎం రత్నపుణ్యవతి తదితరులు పర్యటించారు.
చేబ్రోలులో తొలి కేసు నమోదైంది. చేబ్రోలు శాలిపేటకు చెందిన బియ్యం వ్యాపారి ఇటీవల వ్యాపార పనుల నిమిత్తం గుంటూరు, తెనాలి వెళ్లి వచ్చినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో ఉన్నారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనాగా నిర్ధారించారు. దీంతో వైద్యాధికారి డాక్టర్ అబ్రహం లింకన్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శివనారాయణ అతడు నివాస ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పిడుగురాళ్ల గాంధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. హైదరాబాదులో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న వ్యక్తి మూడు రోజుల క్రితం కుటుంబంతో పిడుగురాళ్లకు వచ్చాడు. అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో గుంటూరు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. బుధవారం విడుదఐలైన ఫలితాల్లో ఆ వ్యక్తికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు.
వ్యాపార ప్రాంతాన్ని చుట్టుముట్టిన కరోనా
గుంటూరులోని వ్యాపారానికి గుండెకాయ లాంటి ప్రదేశమైన పట్నంబజారు, గంటలమ్మచెట్టు ప్రాంతాలను కరోనా చుట్టుముట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటూ ఈ ప్రాంతాల్లో వ్యాపారం చేసే సుమారు 20 మంది కరోనా భారిన పడ్డారు. లాలాపేట, సంగడిగుంట, ఐపీడీ కాలనిలలో కరోనా భారిన పడిన వారిలో ఈ ప్రాంత వ్యాపారులే అధికం. ఇప్పటికే ఏలూరి బజారుకు చెందిన ఓ వ్యాపారి మృతి చెందినట్లు వచ్చిన సమాచారంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. లాక్‌డౌన్ అనంతరం వ్యాపారాలు నిర్యహిస్తూ కరోనాకు గురయ్యారు.
మిర్చియార్డులో భయం... భయంగా
మిర్చియార్డులో ఇద్దరు వ్యాపారులకు పాజిటివ్ రావడం, వారి కాంటాక్ట్స్‌లో 40 మందికి పైగా క్వారంటైన్ చేయడంతో మిగతా వ్యాపారులు, హమాలీలు, గుమాస్తాలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం ఏడు గంటలకే వేలం కేంద్రాలు బోసిబోతున్నాయి. బుధవారం మిర్చి ఎగుమతి, దిగుమతి, హమాలీలు, దొడ్డి కాపలాదారులు, వేమెన్ల సంఘాల నాయకులు సమావేశమై చర్చించారు. అందరి శ్రేయస్సు దృష్ట్యా వారం పాటు యార్డులో లావాదేవీలు నిలిపేయాలని చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, సెక్రెటరీ వెంకటేశ్వరరెడ్డిలను కోరారు.
స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు. బుధవారం ఆమె విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ వీఆర్‌డీఏ ల్యాబ్‌లో శాంపిల్స్‌ని పూల్డ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ పీ ప్రశాంతి, డీఆర్‌వో సత్యన్నారాయణ, స్పెషల్ కలెక్టర్ బాబూరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ జే యాస్మిన్ పాల్గొన్నారు.
హాట్‌స్పాట్‌లుగా గుంటూరు, నరసరావుపేట, తాడేపల్లి
జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం గుంటూరు, నరసరావుపేట, తాడేపల్లి పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. ఈ మూడు పట్టణాలు హాట్‌స్పాట్‌లుగా మారిపోయాయి. లాక్‌డౌన్ ఆంక్షలు భారీగా సడలించడంతో వైరస్ మరింతగా విజృంభిస్తున్నది. జిల్లాలో బుధవారం సాయంత్రం వరకు 1,074 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 5,810 సేకరించిన స్వాబ్‌ల ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నది. పాజిటివ్ కేసులు చూస్తే ఒక్క గుంటూరులోనే 398, నరసరావుపేటలో 225, తాడేపల్లిలో 122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నిత్యం 20కి పైనే కేసులు నమోదు అవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరిగే కొద్ది రికవరీ రేటు పడిపోతున్నది. మొదట్లో రికవరీ రేటు 70 నుంచి 80 శాతం మధ్య ఉండగా ప్రస్తుతం 53.72 శాతానికే పరిమితమైంది.