పరిశ్రమకు..లాక్‌

ABN , First Publish Date - 2020-05-13T09:32:17+05:30 IST

కరోనా.. ఎన్నో జీవితాలను కల్లోల పరుస్తోంది. లాక్‌డౌన్‌ ప్రభావం అన్ని రంగాలతో పాటు రైతులు, కూలీలు, కార్మికులు వారూ వీరూ అన్న తేడా లేకుండా అందరి జీవనంపైనా పడింది. రెక్కాడితేకానీ డొక్కాడని

పరిశ్రమకు..లాక్‌

లాక్‌డౌన్‌కు 50 రోజులు 

కరోనాతో వివిధ రంగాలు కుదేలు

లక్షలాది మందికి ఉపాధి ప్రశ్నార్థకరం 

వలస కార్మికుల కుటుంబాలు నరకయాతన

భవిష్యత్తులో తలెత్తే పరిణామాలపై ఆందోళన


కరోనా కల్లోలం.. వివిధ రంగాలను కుదేలు చేసింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలుతో పరిశ్రమలపై కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలే గడ్డు పరిస్థితుల్లో చిక్కుకున్న వివిధ రంగాలను లాక్‌డౌన్‌ చిక్కుల్లోకి లాక్కెళ్లింది. మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఆయా రంగాలు దెబ్బతినడంతో 50 రోజులుగా అటు వ్యాపారులు, ఇటు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు జీవనోపాధిని కోల్పోయారు. ఇక వలస కూలీలు, కార్మికులు అయితే సొంత ఊర్లకు వెళ్లే మార్గం లేక.. ఇక్కడ అద్దెలు చెల్లించి బతక లేక నరకయాతన అనుభవిస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

కరోనా.. ఎన్నో జీవితాలను కల్లోల పరుస్తోంది.  లాక్‌డౌన్‌ ప్రభావం అన్ని రంగాలతో పాటు రైతులు, కూలీలు, కార్మికులు వారూ వీరూ అన్న తేడా లేకుండా అందరి జీవనంపైనా పడింది. రెక్కాడితేకానీ డొక్కాడని కూలీల నుంచి, ఆరుగాలం కాయ కష్టం చేసి పంట పండించే రైతుల వరకు కష్టాలకోర్చి భరించాల్సి వస్తోంది. వలస కూలీలకు పూట గడవడమే కష్టంగా మారింది. ఇక పరిశ్రమలు మూత పడినప్పటికీ కార్మికులు, సిబ్బంది జీతాలను చెల్లించాల్సిన పరిస్థితి యాజమాన్యాలపై పడింది. ఆయా పరిశ్రమల్లో విద్యుత్‌ చార్జీలకు సంబంధించి మాగ్జిమమ్‌ డిమాండ్‌ చెల్లించాల్సి ఉండటంతో యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రుణాలకు సంబంధించి వడ్డీలు కట్టేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీలకు పని లేకపోయిన వారికి కావాల్సిన వసతులు కల్పించాల్సి రావడంతో పరిశ్రమదారులపై అదనపు భారం పడింది. భవిష్యత్తులో కార్మికుల కొరత సమస్య కూడా ఎదురవుతుందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక కార్మికులు, చిరు ఉద్యోగులు గత్యంతరం లేని పరిస్థితుల్లో కడు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ఆ ప్రభావం పరిశ్రమల నిర్వహణపైనా, కార్మికుల జీవితాలపై ఏవిధమైన ప్రభావం చూపుతుందోనని పలువురిలో ఆందోళన నెలకొంది.


ఏటా మే 10 వరకు ఉధృతంగా జరిగే లావాదేవీలు కరోనా కారణంగా పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యం సగటున లక్ష నుంచి లక్షన్నర టిక్కీల వరకు జరిగే గుంటూరు మిర్చియార్డు మూత పడింది. యార్డు కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉండటంతో ఇప్పుడప్పుడే లావాదేవీలు పునరుద్ధరించే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపుగా కోటి మిర్చి టిక్కీలు ట్రేడింగ్‌ జరగక కోల్డ్‌స్టోరేజ్‌ల్లోకి చేరాయి. దీంతో రూ.1,800 కోట్ల టర్నోవర్‌ ఆగిపోయింది. అదే ట్రేడింగ్‌ జరిగి ఉంటే యార్డుకు మార్కెట్‌ ఫీజు రూపంలో రూ.20 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. 


టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ భారీగా దెబ్బతింది. 70 స్పిన్నింగ్‌, జిన్నింగ్‌, టీఎంసీ మిల్లులు ద్వారా లక్షాలాది మందికి ఉపాధి లభించింది. కరోనాతో 50 రోజులుగా ఆయా మిల్లులు మూతపడ్డాయి. దీంతో సుమారు నాలుగు లక్షల కుటుంబాలు జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. ఎగుమతులు లేక ఇప్పటికే జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, టీఎంసీ మిల్లుల వద్ద సుమారు రూ.పదివేల కోట్ల విలువైన వివిధ రకాల నిల్వలు పేరుకుపోయాయి. ఇవి మార్కెట్లోకి  వెళితేనే వ్యాపారులకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. నూలు తయారీకి ఉపయోగించే దూది క్యాండిల్‌ ధర కూడా రూ.5 నుంచి రూ.6వేల వరకు తగ్గడంతో యాజమాన్యాలు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. 


ఏటా సుమారు 50 కోట్ల మేర ఉత్పత్తి జరిగే కొల్లూరు ఇటుకను కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. ఎన్నికల అనంతర పరిణామాలతో విక్రయాలు లేక ఎక్కడ ఇటుక అక్కడే నిలిచిపోయింది. ఈ పరిణామాలతో ఇటుక పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుత సీజన్‌లో ఇటుక పరిశ్రమదారులు వలస, స్థానిక కూలీలతో ఇటుక ఉత్పత్తి ప్రారంభించారు. ప్రస్తుత సీజన్‌లో 20 కోట్ల ఇటుకలు కూడా ఉత్పత్తి కాలేదు. కూలీలను రాజమండ్రి పంపించేందుకు 40 మందికి ఒక ఆర్టీసీ బస్సు చొప్పున రూ.72 వేలు ఖర్చు అవుతుందని చెప్పి తమ చేతే కట్టించారని పరిశ్రమదారులు వాపోతున్నారు.  


లాక్‌డౌన్‌ రబీ రైతుకు కష్టాలు తెచ్చిపెట్టింది. డెల్టాలో దీని ప్రభావం రబీ సమయంలో ఏర్పడినా, ఖరీఫ్‌ ధాన్యం అమ్మకాలపైనా చూపింది. ఇప్పటికీ రబీ పంట చేతికొచ్చి అమ్మలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరిద్దరు వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టినా బస్తా మొక్కజొన్నలు రూ.1050 నుంచి రూ.1100 వరకు మాత్రమే ప్రారంభ ధర పలికింది. దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని భరించాల్సి వచ్చింది. పంట ఎండిపోయి ఇళ్లకు చేర్చాల్సిన సమయం దాటిపోతున్నా కూలీలు రాక రైతులే ఒకరికొకరు సాయం చేసుకుంటూ పంటను దక్కించుకున్నా, కొనే నాథుడులేక ధర దోబూచులాడింది. కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లలోనూ రాజకీయ వ్యత్యాసం చూపటంతో రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.  


అనేక రకాల కారణాలతో నిర్మాణరంగం జిల్లాలో ఏడాదిగా కుదేలైంది. రాజధాని నిర్మాణం నిలిపి వేయడంతో రెండు లక్షలకు పైగా కార్మికులు వలస వెళ్ళారు. కరోనాతో ప్రస్తుతం పరిస్థితి మరీ దుర్భరంగా మారింది. 32 రకాల రంగాలకు చెందిన కార్మికులకు ఉపాధి కరువైంది. గ్రీన్‌జోన్‌, ఆరంజ్‌ జోన్‌లలో వెసులుబాటు ఇచ్చినప్పటికి ఇసుక లభ్యత లేక పోవడంతో పనులు ప్రారంభంకాలేదు. గ్రామీణ ప్రాంత కార్మికులకు వ్యవసాయ పనులు కొంత ఉపాధి కల్పించినా పట్టణ ప్రాంతాల్లో  పని కోసం ఎదుకు చూపులే మిగిలాయి.   


దక్షిణ భారత దేశంలో సున్నం పరిశ్రమకు కేంద్రమైన పిడుగురాళ్లలో సుమారు 200పైగా బట్టీలు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు, వలస కూలీలకు ఉపాధి పోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలతో, పనులు లేక వలస కూలీలు, కార్మికులు ఇంటిదారి పట్టారు.


లాక్‌డౌన్‌తో జిల్లాలో మూడు వందలకు పైగా రైస్‌ మిల్లులు ఉన్నా   వీటిలో పది శాతం కూడా పని చేయటం లేదు. మిల్లుల డ్రైవర్లు, కార్మికులు పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నది. దీని వలన ఐదు శాతం మిల్లులు కొన్ని ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. అయితే బియ్యం బయటకు పోయే పరిస్థితి లేక పోవటంతో సదరు మిల్లుల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు తరలించే పరిస్థితి లేక వరి పొట్టు   నిల్వలు పేరుకు పోయి మిల్లులు నిర్వహించలేని పరిస్థితి నెలకుంది.  


పుత్తిడిపై నగిషీలు చెక్కగలిగిన స్వర్ణకారుల బతుకులు నేడు దుర్భరంగా తయారయ్యాయి. చేనేత చితికిపోవడంతో మంగళగిరిలో స్వర్ణకార వృత్తి ఓ కుటీర పరిశ్రమగా తయారైంది. ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న సుమారు పది వేల మంది పూర్తిగా ఉపాధి కోల్పోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. మరో రెండు, మూడేళ్లు గడిచినా స్వర్ణకార వృత్తి కోలుకునే అవకాశం లేదని ఆ వృత్తిలోనివారు అభిప్రాయపడుతున్నారు.  


ఇప్పటికే పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయి... మనుగడ కోసం పాకులాడుతున్న చేనేతకు కరోనాతో  గడ్డుకాలం ఎదురైంది. లాక్‌డౌన్‌ పుణ్యమాని... మంగళగిరిలో సుమారు రెండున్నర వేల కుటుంబాలు   అర్థాకలితో అలమటిస్తున్నాయి. ఉపవృత్తులను కలుపుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఐదు వేల మంది ఉపాధికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగా వస్త్రాలు నేసేందుకు అవకాశం లేకపోవడం, ఇప్పటికే నేసిన చీరెలు అమ్ముడుపోకపోవడం,  ముడి సరుకులు అందకపోవడం వంటి కారణాలతో చేనేత వస్త్ర పరిశ్రమ అతలాకుతలమైంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా... చేనేత ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. 


రాయతీలు విడుదల చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌, ఇతర రాయతీలకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలి. లాక్‌డౌన్‌లో మిల్లుల విద్యుత్‌ బిల్లులను మినిమం శ్లాబ్‌ రేట్‌ ప్రకారం చెల్లించే విధంగా వెసులుబాటు కల్పించాలి.  

- రుఘురామరెడ్డి, ఏపీ స్పిన్నింగ్‌ మిల్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షుడు



లక్షల మంది ఉపాధికి గండం

స్పిన్నింగ్‌, జిన్నింగ్‌, టీఎంసీ, వీవీంగ్‌ ఇతర టెక్స్‌టైల్‌ రంగం సక్రమంగా లేకపోతే లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి. వ్యవసాయ అనుభంద పరిశ్రమలు మూతపడితే రైతులు నష్టపోతారు. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలకు ప్రత్యేక రాయతీలను కల్పించాలి. 

- మన్నవ వెంకటేశ్వరరావు, ఏపీ జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడు




కరోనాతో చితికిపోయాం

కరోనాతో ఇటుక పరిశ్రమ చితికపోయింది. భవన నిర్మాణాలు నిలిచిపోవడంతో గత సీజన్‌లో తీసిన ఇటుకలే కల్లాల్లో మిగిలిపోయాయాయి. ఈ సీజన్‌లో ఇటుక ఉత్పత్తికి సరుకు సిద్ధం చేసుకుంటే కరోనా ఆంక్షలతో పనులు నిలిచిపోయాయి. 50 రోజుల నుంచి వలస కూలీలకు అన్ని వసతులు కల్పించాల్సి రావం, ప్రస్తుతం వారిని స్వస్థలాలకు పంపే ఖర్చులతో నష్టం వాటిల్లుతుంది.  

-ఘంటా రంగారావు, ఇటుక పరిశ్రమదారుడు, కొల్లూరు 



ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. మిగతా వృత్తులతో పోలిస్తే చేనేతకు ఎక్కువ నష్టం వాటిల్లింది. మరో నాలుగైదు నెలలు మగ్గం పని ఉండకపోవచ్చు. ఉపాధి హామీ పథకం లెక్కలోనైనా కనీసం నెలకు రూ.7,500 చొప్పన కార్మికులకు చెల్లించాలి. నేతన్న నేస్తం పథకాన్ని షెడ్డు కార్మికులకు వర్తింపజేసి రూ.21 వేలు అందించాలి.  

- పిల్లలమర్రి బాలకృష్ణ, ఏపీ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి



సంక్షోభంలో రైస్‌ మిల్లులు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైస్‌ మిల్లుల పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు వడ్డీ రాయితీ కల్పించి ఆదుకోవాలి. రైతులకు, కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో రైస్‌ మిల్లులు పూర్తి స్థాయిలో పని చేసే విధంగా అనుమతులు ఇవ్వాలి.  

- వూరా భాస్కరరావు, మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, నరసరావుపేట



పాడైన సరుకు నిల్వలు

లాక్‌డౌన్‌తో సున్నపు బట్టీలు ఒక్కసారిగా మూతపడటంతో రన్నింగ్‌ బట్టీల్లో ఉన్న సరుకు అంతా పాడైపోయాయి. ఒక్కొక్క బట్టీకి రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లింది. కరెంట్‌ బిల్లులు, అద్దెలు కలిపి లక్షల్లో నష్టపోతున్నారు. లాక్‌డౌన్‌కు ముందే పంపిణీ ముడిసరుకు ఇప్పట్లో నగదు వచ్చే పరిస్థితి కన్పించటంలేదు.  

- పల్చూరి నాగేశ్వరరావు, పిడుగురాళ్ల



ప్రభుత్వం ఆదుకోవాలి

బడా మాల్స్‌ వచ్చాక స్వర్ణకారులకు పని దొరకడమే కష్టంగా మారింది. లాక్‌డౌన్‌ స్వర్ణకారుల జీవితాలను మరింత కుంగదీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేయాలి. లాక్‌డౌన్‌ తరువాత వృత్తిని కొనసాగించేందుకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలి.

పారేపల్లి మహేష్‌, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు, మంగళగిరి 

Updated Date - 2020-05-13T09:32:17+05:30 IST