50 రోజులు.. 190 కేసులు

ABN , First Publish Date - 2020-05-29T09:15:46+05:30 IST

నరసరావుపేటను కరోనా వీడటం లేదు. గురువారం కూడా రెండు కేసులు నమోదయ్యాయి.

50 రోజులు.. 190 కేసులు

నరసరావుపేటను వీడని వైరస్‌ 


నరసరావుపేట, మే 28: నరసరావుపేటను కరోనా వీడటం లేదు. గురువారం కూడా రెండు కేసులు నమోదయ్యాయి. శ్రీనివాసనగర్‌లోని ఇద్దరికి కరోనా సోకింది. పట్టణంలో వైరస్‌ ప్రారంభమై 50 రోజులు గడిచింది. ఇప్పటికి 190 కేసులు నమోదుకాగా వాటిలో రికార్డు స్థాయిలో వరవకట్టలోనే 139 ఉన్నాయి. వైరస్‌ బారిన పడి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 9న వరవకట్టలో తొలి కేసు, తొలి మరణం నమోదైంది. అప్పటి నుంచి వైరస్‌ విజృంభణతో నరసరావుపేట విలవిలలాడుతుంది.


మునిసిపల్‌ స్థాయి పట్టణంలో 190 కేసులు నమోదవ్వటం దేశంలోనే ఒక్క నరసరావుపేటలోనే జరిగిందని నిపుణులు చెపుతున్నారు. తొలి కేసు నమోదైన సమయంలో యంత్రాంగం నిర్లక్ష్యంతో వైరస్‌ చాపకింద నీరులా విస్తరించి ప్రమాద ఘంటికలు మోగించింది. పల్నాడు రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ద్వారా కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. డాక్టర్లు, వలంటీర్లు, డీలర్లు, సచివాలయ ఉద్యోగి, ఒక ఏఎస్‌ఐ వైరస్‌ బారిన పడ్డారు. ఈ నెల మొదటి వారం నుంచి అధికారులు అప్రమత్తమై సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేసి వైరస్‌ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా పూర్తిగా వైరస్‌ వీడలేదు. 


ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేనా? 

ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్త నిబంధనలను విడుదల చేసింది. దీని ప్రకారం కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్ల పరిధిని తగ్గించింది. పాజిటీవ్‌ కేసు నమోదైనా 28 రోజుల వరకు కొత్త కేసులు నమోదు కాక పోతే ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ నుంచి తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు అమలు చేస్తే పట్టణంలో క్లస్టర్‌ ప్రాంతాలుగా ఉన్న వాటిలో కొన్నింటిని తొలగించే అవకాశం ఉంది. ఎన్‌జీవో కాలనీలో గత నెల 19న పాజిటీవ్‌ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ నుంచి డీ నోట్‌ ఫైడ్‌ చేయాల్సి ఉంది. అల్లూరివారిపాలెంలో గత నెల 22న, ఇస్లాంపేటలో 29, రామిరెడ్డిపేట, అరండల్‌పేటలలో 29న చివరి కేసులు నమోదయ్యాయి.


ఈ ప్రాంతాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్తగా 28 రోజుల్లో కేసులు నమోదు కాక పోవటంతో వీటిని కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా తొలగించాల్సి ఉంది. యాక్టీవ్‌ లేని కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిని కూడా కొత్త నిబంధనల ప్రకారం తొలగించాల్సి ఉంది. ఏనుగుల బజారు, పాతూరు, ప్రకాష్‌ నగర్‌, లింగంగుంట్ల ప్రాంతాల్లో క్లస్టర్‌ పరిధిని 200 మీటర్లకు తగ్గించాల్సి ఉంది. పెద చెరువు, వరవకట్ట, శ్రీనివాసనగర్‌లో మాత్రమే కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మూడు ప్రాంతాలను యాక్టీవ్‌ క్లస్టర్లుగా ఉంచి మిగతా ప్రాంతాలను డీనోటిఫై చేయాల్సి ఉంది. కొత్త నిబంధనలను అమలు చేసి తమ ప్రాంతాలను డీ నోటిఫై చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లును వివరణ కోరగా శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ నిర్వహించే సమావేశంలో కొత్త ఉత్తర్వులపై చర్చించి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. 

Updated Date - 2020-05-29T09:15:46+05:30 IST