50 రోజులు..387 కేసులు

ABN , First Publish Date - 2020-05-13T09:27:00+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా జిల్లాలో వెలుగు చూసి 50 రోజులైంది.

50 రోజులు..387 కేసులు

లాక్‌డౌన్‌ రోజే జిల్లాలో తొలి కేసు

జిల్లా నలుమూలలకు వైరస్‌ విస్తరణ

గుంటూరులో 15 శాతం ప్రాంతం రెడ్‌జోన్‌లో 

జిల్లాలో మంగళవారం పాజిటివ్‌ కేసులు నిల్‌


గుంటూరు(సంగటిగుంట), మే 12: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా జిల్లాలో వెలుగు చూసి 50 రోజులైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి 24వ తేదీనే తొలి కేసు గుంటూరులోని మంగళదాస్‌నగర్‌ లో వెలుగు చూసింది. 50 రోజుల్లో జిల్లా నలుమూలలకు వైరస్‌ విస్తరించింది. మంగళవారం నాటికి 387 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో 163 కేసులు గుంటూరు నగరానివి కాగా, నరసరావుపేట పరిసర ప్రాంతాలలో 170 కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు, తెనాలి, కర్లపాలెం, చిలకలూరిపేట, మాచర్ల, దాచేపల్లి, ధూళ్ళిపాళ్ళ, క్రోసూరు, నడికుడి ప్రాంతాలలో కలిపి మరో 54 కేసులు ఉన్నాయి. మంగళవారం నాటికి 198 మంది నెగెటివ్‌తో ఆస్పత్రుల నుంచి బయటకు రాగా, ఇంకా 181 మంది చికిత్స పొందుతున్నారు.


మంగళవారం జిల్లాలో కేసులు నమోదు కాలేదు. గుంటూరులో శుక్రవారం నాటి వరకు 15.30781 శాతం భూభాగం రెడ్‌జోన్‌ పరిధిలోకి వెళ్లింది. నగర పరిధిలోని 22 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 163 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్‌తో అధికారికంగా ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. గుంటూరు నుంచి అధికారికంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య సుమారు 10 మంది మాత్రమే. వారిలో ఎక్కువ మందికి కరోనా సోకింది. గంటూరులో కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో మాచర్ల, దాచేపల్లి ప్రాంతాలలో కూడా కేసులు వెలుగు చూశాయి. ఏప్రిల్‌ 5, 6 తేదీలలో ఈ ప్రాంతాలలో అదుపులోకి వస్తుంది అనుకుంటున్న  తరుణంలో నరసరావుపేట వరవకట్టకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. అతడి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను పరీక్షలు చేయగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అదే సమయంలో ఓ ఆసుపత్రి నిర్వాకం కేసులు పెంచింది.  

Read more