అమరావతిపై ఎందుకంత కక్ష

ABN , First Publish Date - 2020-06-19T10:00:24+05:30 IST

రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాజధాని గ్రామాల రైతులు,

అమరావతిపై ఎందుకంత కక్ష

184వ రోజు ఆందోళనలో రాజధాని రైతుల ఆవేదన

శాసన సభ పరిణామాలతో అనంతవరంలో ఆగిన రైతు గుండె

సెలెక్ట్‌ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ మండలికి పంపటం రాజ్యాంగ విరుద్ధం : ఎంపీ గల్లా


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తుళ్ళూరు, తాడికొండ, జూన్‌ 18: రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలన అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు గురువారానికి 184వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ఇంటిటా వివిధ రూపాల్లో  నిరసనలు తెలిపారు. అమరావతి వెలుగు కార్యక్రమం కింద రైతులు, కూలీలు, మహిళలు ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామస్థులు చేస్తున్న నిరసనలు గురువారానికి 53వ రోజుకు చేరుకున్నాయి.


రెండు రోజులుగా రాష్ట్ర శాసన సభలో జరుగుతున్న పరిణామాలతో మనోవేదనకు గురై అనంతవరానికి  చెందిన చింకా సాంబయ్య అనే రైతు గురువారం మృతి చెందారు. ప్రభుత్వం రాజధాని తరలింపు చర్యలు వేగవంతం చేస్తుందన్న బాధతో గుండెపోటుకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సాంబయ్య తనకున్న ఎకరం భూమిని రాజధానికి ఇచ్చారు. పనులు లేక, కౌలు రాక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతిపై ఎంపీ గల్లా జయదేవ్‌ సంతాపం తెలిపారు. జేఏసీ నేత ప్రొఫెసర్‌ కొలకపూడి శ్రీనివాస్‌ తదితరులు రైతులు సాంబయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


లోక్‌సభలో గళం వినిపిస్తా : ఎంపీ గల్లా జయదేవ్‌

రాష్ట్ర రాజధాని అమరావతి అంశంపై లోక్‌సభలో మాట్లాడతానని ఎంపీ గల్లా జయదేవ్‌ రైతులకు హామీ ఇచ్చారు.  రాజధాని పరిధిలోని తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించారు. అమరావతి ఉద్యమం భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో కూడా రైతులు అమరావతి కొనసాగాలని ఇళ్ల నుంచి ఉద్యమం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆలోచింపచేశారన్నారు. శాసనమండలి తిరస్కరించి సెలెక్ట్‌ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ మండలికి పంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రజల పక్షాన పని చేయాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత కక్ష కోసం పని చేస్తుందని  విమర్శించారు.


మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమరావతి రైతులకు నాలుగు విధాలుగా కౌలు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని, దీనిని సహించేది లేదన్నారు. తమను కేసులతో వేధిస్తున్నారని మందడం రైతులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. 60 మంది గ్రామస్థుల్లో ఒక్కొక్కరిపై 14 కేసులు దాక ఉన్నాయన్నారు. కనీసం నిరసన తెలుపుకునే స్వేచ్ఛ లేకుండా, కదిలితే కేసు కడుతున్నారని వాపోయారు.  కార్యక్రమంలో దళిత జేఏసీ కన్వీనర్‌ కే శ్రీనివాస్‌, టీడీపీ నేత చిట్టాబత్తిని చిట్టిబాబు, యువజన జేఏసీ నేత రావిపాటి సాయి, దళిత జేఏసీ నేతలు స్టాలిన్‌, చిలక బసవయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2020-06-19T10:00:24+05:30 IST