-
-
Home » Andhra Pradesh » Guntur » 144 SECTION TILL MONTH END
-
31 వరకు జిల్లాలో 144వ సెక్షన్ అమలు
ABN , First Publish Date - 2020-03-23T08:21:40+05:30 IST
కరోనా వైరస్‌ను కట్టుడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు జిల్లాలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని అర్బన్ పోలీసు అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ...

- ప్రజలు గుంపులు గుంపులుగా ఒక చోట చేరవద్దు
- నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
- విదేశాల నుంచి వచ్చిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి
గుంటూరు, మార్చి 22: కరోనా వైరస్‌ను కట్టుడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31 వరకు జిల్లాలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని అర్బన్ పోలీసు అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. ఆదివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 144వ సెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు గుంపులుగుంపులు ఒక చోట చేరరాదన్నారు. ప్రతి ఒక్కరు తప్పని సరిగా సామాజిక గౌరవం పాటించాలన్నారు. 31 వరకు సకలం బంద్‌గా ఉంటుందన్నారు. నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద శానిటైజర్స్ నీళ్ళు ఏర్పాటు చేయాలన్నారు. నిత్యావసరాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని, ముఖ్యమైన సమాచారం ఉంటే సోషల్ రెస్పాన్సిబులిటీ కింద వెంటనే తెలియజేయాలన్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి డయల్ 100, కంట్రోల్ రూమ్ 8688831568 నెంబర్‌తో పాటు 8688831302, 8688831470 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
సుమారు 1500 మంది ఉన్నట్లు అంచనా
విదేశాల నుంచి ఇటీవల జిల్లాకు వచ్చిన వారిపై అర్బన్, రూరల్ పరిధిలోని నిఘా వర్గాలు వివరాలు సేకరిస్తున్నాయి. గడిచిన రెండు వారాలుగా ఇతర దేశాల నుంచి జిల్లాలోకి అడుగు పెట్టిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. విదేశాలకు చెందిన 550 మంది ప్రస్తుతం గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో నివాసం ఉంటున్నారు. వీరిలో సుమారు 8 మంది ఇటీవల విదేశాల్లోని తమ స్వస్థలాలకు వెళ్ళి వచ్చినట్లు గుర్తించారు. వీరు కాకుండా అర్బన్ జిల్లా పరిధిలో మరో 470 మంది వరకు ఇటీవల విదేశాలకు వెళ్ళి వచ్చినట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం వారెవరెవరు అనేది గుర్తిస్తున్నారు. విదేశాలకు వెళ్ళి వచ్చినవారు పోలీసులకు స్వచ్ఛందంగా తెలియజేస్తే పరీక్షించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు.