12 ప్యాసింజర్‌ రైళ్లు.. ఇక ఎక్స్‌ప్రెస్‌లు

ABN , First Publish Date - 2020-10-23T10:11:47+05:30 IST

గుంటూరు రైల్వే జంక్షన్‌ మీదగా రాకపోకలు సాగించే 12 ప్యాసింజర్‌ రైళ్లని రైల్వేబోర్డు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చేసింది.

12 ప్యాసింజర్‌ రైళ్లు.. ఇక ఎక్స్‌ప్రెస్‌లు

గుంటూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే జంక్షన్‌ మీదగా రాకపోకలు సాగించే 12 ప్యాసింజర్‌ రైళ్లని రైల్వేబోర్డు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చేసింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పలు చిన్న రైల్వేస్టేషన్లలో ఇకపై ఆ రైళ్లు నిలిచే అవకాశం ఉండదు. కొత్త రైల్వే టైంటేబుల్‌ అమలులోకి రాగానే ఆయా ప్యాసింజర్‌ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారిపోతాయి. దాంతో వాటిల్లో ప్రయాణ ఖర్చు కూడా పెరగనున్నది.  లాక్‌డౌన్‌ ముందు వరకు గుంటూరు మీదగా ఆరు జతల ప్యాసింజర్‌ రైళ్లు దూర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించేవి. నెంబరు. 57327/57328 డోన్‌ - గుంటూరు - డోన్‌, నెంబరు. 57381/57382 గుంటూరు - నరసపూర్‌ - గుంటూరు, నెంబరు. 57651/57652 సికింద్రాబాద్‌ - రేపల్లె - సికింద్రాబాద్‌, నెంబరు. 67231/67232 తిరుపతి - గుంటూరు - తిరుపతి, నెంబరు. 77281/77282 గుంటూరు - కాచీగూడ - గుంటూరు, నెంబరు. 56504/56503 విజయవాడ - బెంగళూరు కంటోన్మెంట్‌ - విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. వీటిల్లో నిత్యం వేల మంది పేద ప్రజలు రాకపోకలు సాగించే వారు. రోడ్డు రవాణ ఖర్చుతో పోల్చుకొంటే చాలా తక్కువ టిక్కెట్‌ చార్జీకే గమ్యస్థానానికి చేరుకునేవారు. ఏ కారణం చేతనో  వీటిని ఎక్స్‌ప్రెస్‌లుగా చేశారు.  


హాల్టింగ్‌ల ఎత్తివేతపై జోక్యం చేసుకోవాలి

గతంలో ఒకటి, రెండు ఎక్స్‌ప్రెస్‌లు మినహా మిగిలిన అన్ని రైళ్లకు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడిలో నిలుపుదల సౌకర్యం ఉండేది. అయితే రెండు రోజుల క్రితం నుంచి పట్టాలెక్కించిన నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కి తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లేటప్పుటు పిడుగురాళ్ల, నడికుడిలో నిలుపుదల ఎత్తేశారు. నరసపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడిలో నిలుపుదల ఎత్తేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోన్నది. తక్షణమే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జోక్యం చేసురేని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి గతంలో వలే నిలుపుదల సౌకర్యాన్ని మంజూరు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-23T10:11:47+05:30 IST