లోకేష్‌ పర్యటనలో వైసీపీ నేతల హల్‌చల్‌.. పరిస్థితి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-10-19T22:57:07+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే.

లోకేష్‌ పర్యటనలో వైసీపీ నేతల హల్‌చల్‌.. పరిస్థితి ఉద్రిక్తం

కాకినాడ : తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఈ భారీ వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పంటపొలాలు నీట మునిగి రైతన్నలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. వరద బాధితులను బాధలను అడిగి తెలుసుకున్నారు. అయితే లోకేష్ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు హల్ చల్ చేశారు.


ఎందుకిలా..!?

‘జై జగన్.. జై జై జగన్’ అంటూ నినాదాలతో టీడీపీ క్యాడర్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం లోకేష్ పర్యటనలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఇంకా అదుపులోకి వచ్చిందా..? రాలేదా..? అనేది తెలియరాలేదు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇలా చేయడం ఎంతవరకు సబబు?.. టీడీపీ నేతలు ఎవరూ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించకూడదా..? అంటూ వైసీపీ నేతలను తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.


జగన్ అలా.. మంత్రులు ఇలా!

ఈ ఘటనకు ముందు లోకేష్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వర్షాలు.. వరదలకు రైతులు నష్టపోతే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోకుండా హెలికాప్టర్‌పై తిరుగుతున్నారని.. మరోవైపు మంత్రులేమో అన్నదాతలను అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు మునిగి నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎక్కడున్నారు..? ఏమయ్యారు..? అని లోకేష్ ప్రశ్నించారు. మంత్రులంతా లోకేష్‌ను ఎలా హేళన చెయ్యాలనే ఎంతసేపూ ఆలోచిస్తున్నారన్నారు. ఆ శ్రద్ధ అన్నదాతల కష్టాలు తీర్చడానికి చూపించడం లేదని మండిపడ్డారు. గత వరదకు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారమే ఇవ్వలేదని.. రైతు భరోసాలోను అన్నదాతలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీది రైతు ప్రభుత్వం కాదని రైతులు లేని ప్రభుత్వమని లోకేష్ ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-10-19T22:57:07+05:30 IST