-
-
Home » Andhra Pradesh » East Godavari » ycp vro warning
-
చెప్పినట్టు వింటావా ట్రాన్స్‌ఫర్ అయిపోతావా..
ABN , First Publish Date - 2020-12-06T05:55:38+05:30 IST
‘మాట వింటావా? లేక ట్రాన్స్‌ఫర్ అయిపోతావా?? ఇదీ ఓ వీఆర్వోపై వైసీపీ గ్రామస్థాయి నాయకుల ప్రతాపం..

పైడిపాల వీఅర్‌వోపై వైసీపీ కార్యకర్తల ఒత్తిడి
రౌతులపూడి, డిసెంబరు 5: ‘మాట వింటావా? లేక ట్రాన్స్‌ఫర్ అయిపోతావా?? ఇదీ ఓ వీఆర్వోపై వైసీపీ గ్రామస్థాయి నాయకుల ప్రతాపం.. తమకు అధికారం ఉంది కాబట్టి అధికారులు తమ మాట విని తీరాలనే ధోరణితో బెదిరింపులకు దిగారు. ఎస్.పైడిపాల గ్రామంలో సూల్లోజు పెంటయ్య పేరున సర్వే నెం 294-2లో 2.25 ఎకరాల డి పట్టాభూమి ఉంది. పెంటయ్య, అయన భార్య 8 సంవత్సరాల క్రితం మృతి చెందారు. వారికి పిల్లలు లేరు. అయితే ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. పెంటయ్యకు ముగ్గురు మేనకోడళ్లు ఉన్నారు. దీంతో వారిలో ఒక మహిళను తెరమీదకు తీసుకువచ్చారు. ఆమె పేరున భూమిని బదలాయించాలని వీఆర్వోపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం అలా చేయడం సాధ్యం కాదని వీఆర్వో చెప్పినా వైసీపీ నాయకులు మాట వినలేదు. పైగా బెదిరింపుల పర్వానికి దిగారు. ‘మాట వినకుంటే నిన్ను ఏమి చేయాలో మాకు తెలుసు.. ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ కొట్టించాలో తెలుసు’ అంటూ రంకెలేస్తున్నారు. అయితే వీఆర్వో మాత్రం వైసీపీ నాయకుల బెదిరింపులకు లొంగలేదు. ఏమి చేసినా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేనని స్పష్టం చేశారు.
రూల్‌కు వ్యతిరేకంగా పని చేయలేను
- వీఆర్వో శ్రీనివాసరావు
సూల్లోజు పెంటయ్య పేరున ఉన్న 2.25 ఎకరాలను ఆయన మేనకోడలు బి.సత్యవతి పేరున రికార్డు మార్చమని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారు. రూల్స్‌కు వ్యతిరేకంగా పని చేయలేను. వేరే చోటుకు బదిలీ చేస్తే వెళ్లిపోయేందుకు సిద్ధంగానే ఉన్నాను.