వైసీపీ పాలనలో దాడులు

ABN , First Publish Date - 2020-12-06T05:46:44+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, బీసీ, మైనారిటీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు.

వైసీపీ పాలనలో దాడులు
బాధితులను పరామర్శిస్తున్న నాయకులు

    ఎమ్మెల్సీ రామ్మోహన్‌

భానుగుడి(కాకినాడ) డిసెంబరు, 5: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, బీసీ, మైనారిటీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. ఇకపై ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా టీడీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అనపర్తి మండలం పులవర్తి గ్రామానికి చెందిన పంపన ఆనందరావు వైసీపీ నాయకుల ఆగడాలను తట్టుకోలేక పురుగుల మందు తాగి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రామ్మోహన్‌తో పాటు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే ఎన్‌.రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెటి చంద్రమోహన్‌ తదితరులు శనివారం పరామర్శించారు.  ఆనందరావు తల్లికి, భార్యకు, పిల్లలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వారం రోజులుగా ఆనందరావును వైసీపీ నాయకులు చిత్ర హింసలకు గురి చేశారన్నారు. అందరికీ ధైర్యం చెప్పే కార్యకర్తే ఇలా చేసుకున్నాడంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. వైసీపీ నాయకులు చెప్పినట్టే పోలీసులు కూడా ఆడుతున్నారని ఎటువంటి కేసు నమోదు చేయకపోయినా రెండు రోజుల పాటు స్టేషన్‌లో ఉంచి వేధించడం సరికాదని అన్నారు. ఎస్‌ఐ, సీఐను సస్పెండ్‌ చేయాలన్నారు.  ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితులకు ధైర్యం చెప్పేందుకు వచ్చామన్నారు.  మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేకాట స్థావరాలు విచ్చలవిడిగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కాకినాడలో స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో  పేకాట స్థావరం నిర్వహిస్తున్నారన్నారు. సమాచారం పోలీసులకు తెలిసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.  

 

Read more