‘వ్యాపార సంస్థగా వైసీపీ ప్రభుత్వం’

ABN , First Publish Date - 2020-12-27T07:02:22+05:30 IST

వైసీపీ ప్రభుత్వం వ్యాపార సంస్థగా మారిందని, కక్షపూరిత రాజకీయాలు, అమాయక ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు.

‘వ్యాపార సంస్థగా వైసీపీ ప్రభుత్వం’

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు 26: వైసీపీ ప్రభుత్వం వ్యాపార సంస్థగా మారిందని, కక్షపూరిత రాజకీయాలు, అమాయక ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి భూముల కొనుగోలు, మట్టి ఫిల్లింగ్‌లో జరిగిన అవినీతిపై నివేదిక కోరితే సీఎం జగన్‌కు నిజాలు తెలుస్తాయన్నారు. కొమరగిరి ప్రాంతంలో ఎకరం రూ.40 లక్షలు ఉండగా, రూ.60 లక్షలకు కొనుగోలు చేసి భారీ అవినీతికి తెరలేపారన్నారు. వందల కోట్ల రూపాయలు గ్రావెల్‌ ఫిల్లింగ్‌ పేరుతో అవినీతికి పాల్పడ్డారన్నారు. రూ.4 వేల కోట్లు అవినీతి జరిగినందుకా 5 రోజుల ఇళ్ల పండుగ అని ప్రశ్నించారు. కాకినాడ నగరానికి తక్కువ దూరంలో నివాసయోగ్యమైన స్థలాలు మేడలైను, ఇంద్రపాలెం, గురజనాపల్లిలో ఉండగా, కొమరగిరిలో ఎందుకు కొనుగోలు చేశారన్నారు. ఊరికి దూరంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై  పునరాలోచించాలని, ఇల్లు ఒక చోట, ఉపాధి ఒక చోట అయితే పేదవాడికి ఒరిగేదేముందన్నారు. కాకినాడ నగర ప్రజలకు కొమరగిరిలో స్థలాలు ఇస్తే ఉపయోగం ఏముంటుందన్నారు.  ఒకరికి ఇంటి స్థలం ఇచ్చామంటే ఇల్లు కట్టుకుని జీవితకాలం అందులో జీవించేలా ఉండాలని నవీన్‌ అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-27T07:02:22+05:30 IST