వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మొదు

ABN , First Publish Date - 2020-10-21T05:45:23+05:30 IST

పేపరుమిల్లు కార్మికులకు మేలు చేశామని చెబుతున్న వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని టీఎన్‌టీయూసీ నాయకుడు చిట్టూరి ప్రవీణ్‌చౌదరి అన్నారు.

వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మొదు

  • నిరాహార దీక్షతో సాధించిందేమీ లేదు 
  • టీఎన్‌టీయూసీ నాయకుడు ప్రవీణ్‌చౌదరి 

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 20: పేపరుమిల్లు కార్మికులకు మేలు చేశామని చెబుతున్న వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని టీఎన్‌టీయూసీ నాయకుడు చిట్టూరి ప్రవీణ్‌చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం పేపరుమిల్లు సమీపంలోని టీఎన్‌టీయూసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము గుర్తింపు యూనియన్‌గా ఉన్నప్పుడు జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ సమక్షంలో 12(3) నూతన అగ్రిమెంట్‌ 2019 జనవరిలో  చేశామని చెప్పారు. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా 194 మంది కాంట్రాక్టు కార్మికులను మూడు విభాగాలుగా విభజించి 84 వేకెన్సీ, 55 బదిలీలు గాను, 55 కోర్‌ పొజిషన్స్‌ గాను చేర్చామన్నారు. అటుపై జరిగిన పరిణామాల్లో టీఎన్‌టీయూసీ మరింత బలపడుతుందనే అక్కసుతో అగ్రిమెంట్‌ అమలులో ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈనెల 12న పేపరు మిల్లులో ఉన్న 10 యూనియన్లతో యాజమాన్యం చర్చలు జరిపిందని, దానిలో ఆరు యూనియన్లు కలిపి వైసీపీతో సహ ఓ అవగాహనకు వచ్చారని చెప్పారు. అయితే 84 పొజిషన్స్‌ కింద, 55 బదిలీలు, 55 కోర్‌ పొజిషన్‌ మీద ఒక అవగాహనకు వచ్చి ఈ నెల 17న సమావేశమై 19న ఉత్తర్వులు ఇచ్చేలా నిర్ణయించినట్టు ప్రవీణ్‌చౌదరి చెప్పారు. ఈ లోపు యూనియన్లకు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో నిరాహార దీక్ష డ్రామా ఆడారని విమర్శించారు. వారి చేష్టలకు మిల్లు కార్మికులు భయాందోళనకు గురయ్యారని అన్నారు. ఈనెల 19న రావాల్సిన ఉత్తర్వులకు బ్రేక్‌ చేస్తూ కార్మికుల ప్రయోజనాలకు వైసీపీ నాయకులు భంగం కల్గించారని ఆయన ధ్వజమెత్తారు. 1నుంచి 194 పోస్టులు సీనియార్టీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలన్న వారి డిమాండ్‌ను, మినిట్స్‌ను తుంగలోకి తొక్కి డ్రామాలను బయటపెట్టారని అన్నారు. అగ్రిమెంట్‌లో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని టీఎన్‌టీయూసీతోపాటు ఐదు యూనియన్లు సాధిస్తాయన్నారు. తాము కష్టపడి సాధించిన అగ్రిమెంట్‌ను యాజమాన్యంతో చర్చించి అమలు చేస్తామని  ప్రవీణ్‌చౌదరి అన్నారు. 

Updated Date - 2020-10-21T05:45:23+05:30 IST