వైసీపీ రంగుల సంగతేంటో..

ABN , First Publish Date - 2020-03-08T08:54:24+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై కోడ్‌ అమలులోకి వచ్చినా పంచాయతీలు, సచివాలయాలకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులు మాత్రం అలాగే ఉన్నాయి. శనివారం నుంచే కోడ్‌

వైసీపీ రంగుల సంగతేంటో..

పంచాయతీ, సచివాలయ భవనాలకు ఇంకా తొలగించని వైసీపీ రంగులు

కోడ్‌ అమలుతో చర్యలపై చర్చ

హైకోర్టు ఆదేశాలు సైతం తుంగలో తొక్కిన అధికారులు

ఎన్నికల కమిషన్‌ స్పందనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న విపక్షాలు


(ఆంధ్రజ్యోతి-అమలాపురం)

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై కోడ్‌ అమలులోకి వచ్చినా పంచాయతీలు, సచివాలయాలకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులు మాత్రం అలాగే ఉన్నాయి. శనివారం నుంచే కోడ్‌ అమలులోకి వచ్చిన దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీలు, సచివాలయ భవనాలకు వైసీపీ జెండాను పోలిన రంగులను వేయడంపై గతంలో హైకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. తక్షణమే ఆయా భవనాలకు వేసిన రంగులను మార్పు చేయాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పెడ చెవిన పెట్టింది. అందరూ ఊహించి నట్టుగానే శనివారం నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌, సర్పంచ్‌ ఎన్నికలకు వరుస నోటిఫికేషన్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీచేశారు.


అయితే కోడ్‌ అమలుపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిగా నిబంధనలను అమలుచేసే యోచనలో లేనట్టు ఇప్పటికే తేటతెల్లమవుతోంది. ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయాలతో పాటు వివిధ ప్రభుత్వ నిధులతో మంజూరైన వాటర్‌ స్కీమ్‌, ప్రహారీగోడలు  వంటి వాటికి సైతం వైసీపీ రంగులు వేశారు. ఎన్నికల కమిషన్‌ నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు అందని దృష్ట్యా తామేమీ చేయలేమంటూ పంచాయతీ ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు.


ఈపరిస్థితులపై టీడీపీ, జనసేన, బీజేపీతో సహా వివిధ పక్షాల నేతలు మాత్రం ఎన్ని కల కమిషన్‌ నియమావళి అమలులో ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఎన్నికల వ్యవధి కూడా తక్కువ రోజులు ఉండడంతో కమిషన్‌ ఏ రీతిన స్పందిస్తుందీ, వేసిన వైసీపీ రంగులను తొలగించే అవకాశాలు ఉన్నాయా అనే అంశం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.


అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించు కోకుండానే యథాస్థితిని కొనసాగిస్తున్న ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ నియామవళి అమలుచేస్తుందా అన్న సందిగ్దత రాజకీయపార్టీల్లో నెలకొంది. జిల్లావ్యాప్తంగా వందలాది భవ నాలు వైసీపీ రంగులతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు అక్కడే నామినేషన్ల స్వీకరణలు, కొన్ని పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాలుగా కొలువుదీరనుండడంతో జిల్లా యంత్రాంగం, ఎన్నికల కమిషన్‌ ఏవిధమైన చర్యలు  తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-03-08T08:54:24+05:30 IST