పాడి గేదె విషయంలో గొడవ.. కోపోద్రిక్తుడైన భర్త భార్యను..

ABN , First Publish Date - 2020-10-27T06:13:40+05:30 IST

పాడి గేదె అమ్మకం విషయంలో తలెత్తిన గొడవతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను కత్తితో నరికి చంపేశాడు. ఈ సంఘటనకు సంబంధించి ద్రాక్షారామ ఎస్‌ఐ రామకృష్ణ వివరాలు అందించారు.

పాడి గేదె విషయంలో గొడవ.. కోపోద్రిక్తుడైన భర్త భార్యను..

ద్రాక్షారామ, అక్టోబరు 26: పాడి గేదె అమ్మకం విషయంలో తలెత్తిన గొడవతో కోపోద్రిక్తుడైన భర్త భార్యను కత్తితో నరికి చంపేశాడు. ఈ సంఘటనకు సంబంధించి ద్రాక్షారామ ఎస్‌ఐ రామకృష్ణ వివరాలు అందించారు.  రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన దంపతులు పితాని సూర్యనారాయణ, సూర్యకాంతం(60) వ్యవసాయం, పాడి పశువుల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. గతంలో సూర్యనారాయణ తన నాలుగు కుంచాల పొలం, ఇంటిపక్కన ఉన్న స్థలం తక్కువ ధరకు అమ్మేశాడు. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సూర్యనారాయణ ఓ  పాడి గేదెను రూ.50 వేలకు విక్రయించాడు. పొలం, స్థలం అమ్మినట్లే పాడి గేదెను కూడా తక్కువ ధరకు ఎందుకు అమ్మేశావని సూర్యకాంతం భర్తను నిలదీసింది. 


ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది. ఈ సమయంలో సూర్యనారాయణ కత్తితో సూర్యకాంతం మెడ, పొట్టపై నరకడంతో తీవ్ర గాయాలతో మంచంపై పడిపోయింది. కుమార్తె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. సూర్యకాంతాన్ని 108 అంబులెన్సులో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించగా సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. సంఘటన స్థలాన్ని సీఐ వి.శ్రీనివాస్‌ పరిశీలించారు. ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేపట్టారు.  సూర్యనారాయణ పరారీలో ఉన్నాడు. సూర్యనారాయణ, సూర్యకాంతం దంపతులకు పిల్లలు లేరు. జయశ్రీ సూర్యప్రభ అనే బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది.

Updated Date - 2020-10-27T06:13:40+05:30 IST