అధికారిక కదలికలేవి?

ABN , First Publish Date - 2020-03-21T08:59:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సైతం డివిజన్‌, మండలస్థాయిల్లో సమీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే

అధికారిక కదలికలేవి?

కరోనాపై ప్రజల్లో చైతన్యం.. అధికారుల్లో మాత్రం ఉదాశీనం

ఇళ్ల పట్టాల పంపిణీపైనే రెవెన్యూ అధికారులు బిజీబిజీ

 రాజ్యమేలుతున్న అపారిశుధ్య అధ్వాన పరిస్థితులు

వ్యక్తిగత శుభ్రతపైనే అవగాహనలు.. పరిసరాలపై ఏది మరి

పర్యాటకశాఖ అతిథి గృహాలపై ఆంక్షలేవి ?

రాజకీయ పలుకుబడితో యథేచ్ఛగా నడుస్తున్న కొన్నిహోటళ్లు


(ఆంధ్రజ్యోతి-అమలాపురం)

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సైతం డివిజన్‌, మండలస్థాయిల్లో సమీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల విషయానికొస్తే వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులు అనూహ్యంగా ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు ఇంకా శ్రీకారం చుట్టలేదు. అమలాపురం పురపాలక సంఘంలో అయితే శుక్రవారం ఆటోలలో మైక్‌ల ద్వారా కరోనా ప్రభావంపై ప్రచార అవగాహన కల్పించడం మినహా మిగిలిన అంశాలపై కనీసం దృష్టిసారించడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో ఏ ప్రాంతంలో చూసినా అపారిశుధ్యం తాండవిస్తోంది.


వివిధ ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని అక్కడికక్కడే పోగుపెట్టి కాల్చివేసే పరిస్థితుల పట్ల ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మంచినీటి సరఫరా విషయంలో కూడా మున్సిపల్‌ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం అనుసరించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు తాగునీరు అందని దయనీయస్థితి. గ్రామీణ ప్రాంతాలకు వస్తే మరీ అధ్వానంగా ఉంది. ప్రస్తుతం ఉన్న వైరస్‌ లక్షణాలు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యక్తులు పాటించే శుభ్రతతోపాటు పరిసరాలు, తాగునీరు వంటి సౌకర్యాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో దూరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల్లో క్లీనింగ్‌ చేస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో మాత్రం క్లీనింగ్‌ నామమాత్రంగా కూడా కానరావడంలేదు.


ప్రైవేట్‌ బస్సుల్లో సైతం కనీస నిబంధనలు పాటించడంలేదు. ఆటోలలో కిక్కిరిసిన ప్రయాణికులతో చేస్తున్న ప్రయాణాలు ఏం ప్రమాద ఘటింకలు మోగిస్తాయన్న భయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌ వంటివి మూసివేయించినప్పటికీ పట్టణాల్లోను, పల్లెల్లో ఉండే చిన్నచిన్న షాపుల్లో విక్రయించే తినుబండారాలు, ఇతర వ్యాపార సంస్థల కట్టడికి అధికారులు చర్యలు  తీసుకోవల్సివుంది. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్‌ కట్టడి విషయంలో అత్యంత కీలకమైన పోలీసు, రెవెన్యూశాఖలు మాత్రం ఇంకా ప్రేక్షక పాత్రలోనే ఉన్నాయి.


అమలాపురం డీఎస్పీ మాసూమ్‌బాషా ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగులకు, పాత్రికేయులకు ప్రభుత్వ వైద్యులతో అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా రాజకీయ బలంతో నడుస్తున్న కొన్ని సంస్థలను మూయించే విషయంలో పోలీసుల జోక్యం అనివార్యమవుతోంది. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పర్యాటకశాఖకు చెందిన హోటల్స్‌, ఇతర కేంద్రాల్లో పరిస్థితులు యథావిధిగానే ఉన్నాయి. మలికిపురం మండలం దిండిలో ఉన్న హరిత కోకోనట్‌ రిసార్ట్స్‌ మాత్రం యథావిధిగానే పనిచేస్తోంది.


32 రూమ్‌లకుగాను  శుక్రవారం 20 రూమ్స్‌లో పర్యాటకులు బస చేశారు. విదేశీయుల రాకపోకలపై సమాచారముంటే తెలియజేయాలని మాత్రమే అధికారులనుంచి తమకు ఆదేశాలు అందాయని దిండి రిసార్ట్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 

Updated Date - 2020-03-21T08:59:06+05:30 IST