వారానికో స్కామ్‌ బయటపెడతా!

ABN , First Publish Date - 2020-09-25T17:49:20+05:30 IST

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలోనే ఎమ్మెల్యే పర్వత ప్రసాద్..

వారానికో స్కామ్‌ బయటపెడతా!

16 నెలల కాలంలో 20 స్కామ్‌లు

ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌పై వరుపుల రాజా ఫైర్‌


ప్రత్తిపాడు(తూర్పు గోదావరి): ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలోనే ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ 20 స్కాములకు పాల్పడ్డారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా ఆరోపించారు. వారానికో స్కామ్‌ బయటపెడతానని చెప్పారు.  స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని మచ్చలేని నాయకులుగా ఉన్న మాజీ హోంమంత్రి చినరాజప్ప, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూను అవమానకరంగా మాట్లాడడం దారుణమన్నారు చేతనైతే వారి నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని ఇక్కడ చేసి చూపించాలన్నారు.


మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురు, మరో మాజీ ఎమ్మెల్యే సోదరుడు సహకరిస్తే ఏదో అదృష్టంతో నాలుగో వేల మెజారిటీతో గెలిచిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. లంపకలోవ సొసైటీలో రూ.16 కోట్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్నారని, అయితే డీసీసీబీ చైర్మన్‌గా ఆ సొసైటీకి 5 కోట్లు నిధులు విడుదల చేస్తే రూ.16 కోట్ల అవినీతి ఎలా జరిగిందని రాజా ప్రశ్నించారు. పర్వత ప్రసాద్‌ అంటేనే తప్పుడు కేసులకు మారు పేరని తనపైనా, వెన్న శివ, పైలా బోసులపై 100 కేసులు పెట్టారని, అయినా భయపడేది లేదని రాజా తెలిపారు.


సత్యదేవుని సన్నిధిలో ప్రమాణం చేద్దామని జ్యోతుల నెహ్రూ విసిరిన సవాల్‌ను ప్రసాద్‌ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు.  ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్ముల కన్నబాబు, టీడీపీ సీనియర్‌ నాయకులు వెన్న శివ, కీర్తి వెంకటసుభాష్‌, రావూరి తాతాజీ, పోలిశెట్టి శ్రీను, బీద నానాజీ, అంబటి రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T17:49:20+05:30 IST