-
-
Home » Andhra Pradesh » East Godavari » w word step work
-
మాటతప్పమని.. ఇదేం పని!
ABN , First Publish Date - 2020-12-06T06:56:23+05:30 IST
దివీస్ నిర్మాణం ఆపాలని పోరాటం చేస్తున్న ప్రజలకు తన పాదయాత్రలో భాగంగా నిర్వహించిన దానవాయిపేట బహిరంగసభలో దివీస్‌ను ఎన్నటికీ రానివ్వనని మాటిచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు దివీస్ పనులు జరుగుతుంటే పట్టించుకోనట్టు వ్యవహరించడాన్ని ఏపీ రైతు సంఘం నాయకుడు పెండ్యాల నరసింహరావు తీవ్రంగా దుయ్యబట్టారు.

పాదయాత్రలో ఇచ్చిన మాట జగన్మోహన్‌రెడ్డి ఎందుకు తప్పారు
దివీస్ నిర్మాణం తక్షణమే ఆపాలి.. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తాం
కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న వామపక్షాలు, జనసేన, బీజేపీ.. టీడీపీ మద్దతు
భానుగుడి(కాకినాడ) డిసెంబరు, 5: దివీస్ నిర్మాణం ఆపాలని పోరాటం చేస్తున్న ప్రజలకు తన పాదయాత్రలో భాగంగా నిర్వహించిన దానవాయిపేట బహిరంగసభలో దివీస్‌ను ఎన్నటికీ రానివ్వనని మాటిచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు దివీస్ పనులు జరుగుతుంటే పట్టించుకోనట్టు వ్యవహరించడాన్ని ఏపీ రైతు సంఘం నాయకుడు పెండ్యాల నరసింహరావు తీవ్రంగా దుయ్యబట్టారు. మాట తప్పమని, మడమతిప్పమని చెప్పే సీఎం ఆరోజున ఇచ్చిన మాటను ఎందుకు తప్పారని ప్రశ్నించారు. తొండంగి మండలంలో దివీస్ (బల్క్ డ్రగ్ కంపెనీ) పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద సీపీఎం, సీపీఐ, సీఐటీయూలతో కలిసి కోన గ్రామాలుగా పిలుచుకునే పంపాదిపేట, కొత్తపాకల, దానవాయిపేట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో జనసేన, బీజేపీ నాయకులు పాల్గొనగా, టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ గతంలో హైకోర్టు దివీస్ నిర్మా ణంపై స్టే ఇస్తే వెనక్కుతగ్గిన దివీస్ యాజమాన్యం మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించారంటే ప్రభుత్వ సహకారం ఉందనే భావించాలన్నారు. కోర్టు ధిక్కారణ కింద మళ్లీ కోర్టులో కేసు వేస్తే ముందుగా జైలుకు పోయేది అధికారులేనని గుర్తుచేసుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పంపాదిపేటకు చెందిన కంపల ముసలయ్య మాట్లాడుతూ దివీస్ నిర్మాణం వల్ల సముద్రంపై ఆధారపడి బతుకుతున్న 30వేల మందికి పైగా జీవితాలు అగమ్యగోచరమవుతాయని, తమ పిల్లల భవిష్యత్ తలచుకుంటేనే భయమేస్తుందన్నారు. దివీస్‌పై తాము పోరాడుతుంటే నవంబరు 29న కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆ నిర్మాణం వద్దకు రావడమే కాకుండా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి వెళ్లడం ఎంతవరకూ సమంజసమన్నారు. దివీస్ నిర్మాణం తక్షణమే ఆపాలని, లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇందుకు టీడీపీ, జన సేన, బీజేపీ మద్దతు పలకడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. సీపీఎం రాష్ట్రనాయకుడు నరసింహరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పంతం నానాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్, వామపక్ష నాయకులు తోకల ప్రసాద్, పలివెల వీరబాబు, సింహాచలం, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.