గ్రామ పరిపాలనలో వీఆర్‌వో సేవలు కీలకం

ABN , First Publish Date - 2020-06-18T10:22:05+05:30 IST

గ్రామ పరిపాలనలో విలేజ్‌ రెవన్యు అధికారి (వీఆర్‌వో) సేవలు కీలకమని, గ్రామాల్లో ఏ సంఘటన జరిగినా వారిచ్చే నివేదిక

గ్రామ పరిపాలనలో వీఆర్‌వో సేవలు కీలకం

 కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 


కాకినాడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గ్రామ పరిపాలనలో విలేజ్‌ రెవన్యు అధికారి (వీఆర్‌వో) సేవలు కీలకమని, గ్రామాల్లో ఏ సంఘటన జరిగినా వారిచ్చే నివేదిక ప్రధానమని కలెక్టర్‌ డిమురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రేడ్‌ 2 వీఆర్‌వో పోస్టులను అర్హులైన గ్రామ రెవెన్యు అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ)లకు పదోన్నతులు కల్పించే క్రమంలో బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక నుంచి సచివాలయాల ద్వారా మాత్రమే రెవెన్యు సేవలు అందుతాయన్నారు. గతం కంటే ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయని ఇందుకు అనుగుణంగా అధికారులు ఎప్పటికప్పుడు సన్నద్ధం కావాలని సూచించారు.


ప్రతీ 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటయ్యిందన్నారు. పదోన్నతి పొందిన వీఆర్‌వోలు నిజాయితీగా, సేవా దృక్ఫథంతో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో అవినీతికి తావివ్వద్దన్నారు. సదరు పదోన్నతులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోనే ప్రారంభమయ్యా యని ఆయన తెలిపారు. డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు మాట్లాడుతూ జిల్లాలో 655 గ్రేడ్‌ 2 వీఆర్‌వో పోస్టుల ఖాళీల్లో సీనియార్టీ అనుసరించి నిబంధనల ప్రకారం పదోన్నతులు ఇస్తున్నామన్నారు.


ప్రతీరోజూ ఉదయం, మధ్యాహ్నం 75మంది చొ ప్పున 150 మందికి కౌన్సెలింగ్‌ చేసి ఈనెల 23నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇచ్చారని, జగన్‌ ప్రభుత్వంలో 12ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తమ సిబ్బందికి అవకాశం లభించిందని రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ వీఎస్‌ దివాకర్‌ ఒకప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో మొదటిగా జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టిన కలెక్టర్‌, డీఆర్వోకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-06-18T10:22:05+05:30 IST