వైరస్‌ ఉధృతే!

ABN , First Publish Date - 2020-10-21T06:51:43+05:30 IST

వైరస్‌ ఉధృతే!

వైరస్‌ ఉధృతే!

  • కొవిడ్‌ వైరస్‌ అధికంగా ఉన్న జిల్లాల జాబితాలో ‘తూర్పు’
  • దేశవ్యాప్తంగా 30 జిల్లాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్నట్టు ప్రకటించిన కేంద్రం 
  • అందులో రాష్ట్రం నుంచి తొలి జిల్లా తూర్పుగోదావరి పేరు వెల్లడి
  • చర్చనీయాంశంగా మారిన మన జిల్లాలోని పాజిటివ్‌ల సంఖ్య
  • మంగళవారం నాటికి 1,11,017కి చేరిన మొత్తం కేసులు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో కొవిడ్‌ తీవ్రత ఇంకా అధికంగానే ఉంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే రోజురోజుకు పాజిటివ్‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఈమేరకు దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. అన్ని రాషా్ట్రల్లో కలిపి మొత్తం 30 జిల్లాల్లో కేసులు ఉధృతంగా ఉన్నట్టు వెల్లడించింది. అందులో రాష్ట్రం నుంచి అయిదు జిల్లాలు ఉండగా, తూర్పుగోదావరి తొలి స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. దీంతో జాతీయస్థాయిలో జిల్లాలో కొవిడ్‌ కేసులు చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం నాటికి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,017కు చేరుకున్నాయి. 80,102 కేసులతో రాష్ట్రంలో రెండో స్థానంలో పశ్చిమగోదావరి ఉంది. వాస్తవానికి జిల్లాలో నమోదైన కొవిడ్‌ కేసులకు దరిదాపుల్లో ఏ జిల్లా కూడా లేదు. ఆ స్థాయిలో తూర్పులో పాజిటివ్‌ల పరంపర కొనసాగుతోంది. ఒకానొకదశలో రోజుకు రెండు వేలకు మించిన కేసులు వరుసగా 20 రోజులపాటు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్‌లు లక్షకు చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక మంగళవారం వరకు తేలిన మొత్తం 1.11 లక్షల కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 37,771 పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఆగస్టులో 39,008 కేసులు బయటపడగా, అంతకుముం దు జూలైలో 20,395, ఏప్రిల్‌, మే నెలలకు కలిపి వెయ్యి వరకు గుర్తించారు. ఈ స్థాయి రెట్టింపు వేగంతో పాజిటివ్‌లు పెరగడం దేశంలోనే కేసుల ఉధృతిలో తూర్పు చోటుచేసుకోవడానికి కారణమైందనే విశ్లేషణలు సాగుతున్నాయి. 

  • వదిలేశారు అందుకే...

గడిచిన రెండు నెలల నుంచీ రాష్ట్రంలో అత్యధిక కేసులతో తూర్పు విలవిల్లాడుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా లేకుండా జిల్లాలో కొవిడ్‌ నియంత్రణలో పూర్తిగా చేతులెత్తేసింది. నిత్యం వేలల్లో వస్తున్న పాజిటివ్‌లతో ఉక్కిరిబిక్కిరై రెడ్‌జోన్‌ల ఏర్పాటు, వాటి పర్యవేక్షణ మొత్తం గాలికి వదిలేసింది. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తులను గుర్తించి లక్షణాల ఆధారంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ లేదా హోంఐసోలేషన్‌లో ఉంచడం అనేది తేల్చడానికి రోజుల తరబడి సమయం పట్టడంతో ఎక్కడికక్కడ అనేకమంది పాజిటివ్‌ సోకిన వ్యక్తులు ఇళ్ల నుంచి యథేచ్ఛగా బయట తిరిగేసే పరిస్థితులు తలెత్తాయి. దీంతో వైరస్‌ మహమ్మారి జిల్లావ్యాప్తంగా విస్తరించి పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా వణికిపోయేలా చేసింది. కేసులు తీవ్రస్థాయిలో ఉన్న దశలో పూర్తి స్థాయిలో పడకలు లేక, చికిత్స చేసే ఆసుపత్రులు సరిపోక జనం నరకయాతన పడ్డారు. సరైన వైద్య సదుపాయాలు అందక ఎందరో ప్రాణా లు కోల్పోయారు. ఆక్సిజన్‌ పడకలు చాలక, చివరి నిమిషంలో ఐసీయూ బెడ్లు దొరక్క ఎందరో బాధితులు కన్నుమూశారు.

  • తాజాగా 457 కేసులు

జిల్లాలో కొత్తగా 457 మంది కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు. ఇందులో గడచిన 24 గంటల్లో ట్రూనాట్‌ ద్వారా చేసిన వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో 219 మంది, రాపిడ్‌ కిట్‌లతో చేసిన పరీక్షల్లో 238 మంది వ్యాధికి గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,017కి చేరింది. తాజాగా ఇద్దరి మృతి చెందడంతో కరోనా మరణాలు 590 నమోదయ్యాయి. యాక్టివ్‌లో 5,994 మంది ఉండగా, 1,04,433 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-10-21T06:51:43+05:30 IST