లింకు తెగిన వైరస్
ABN , First Publish Date - 2020-09-12T10:30:00+05:30 IST
జిల్లాలో కొవిడ్ కేసులు వెలుగు చూసిన తొలి రోజుల్లో ఒక కుటుం బంలో ఎవరికైనా పాజిటివ్ వస్తే చాలా హడావుడి ఉండేది

ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులపై తగ్గిన శ్రద్ధ
ఆచూకీ తెలుసుకోవడంలో యంత్రాంగం నిర్లక్ష్యం
ఇటు సరైన సమాచారం ఇవ్వని పాజిటివ్ బాధితులు
దాంతో జనం మధ్యనే అనుమానితుల సంచారం
జిల్లాలో కేసులు పెరిగిపోవడానికి ఇదో కారణం
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కొవిడ్ కేసులు వెలుగు చూసిన తొలి రోజుల్లో ఒక కుటుం బంలో ఎవరికైనా పాజిటివ్ వస్తే చాలా హడావుడి ఉండేది. పరిసర ప్రాంతాల వారు వణికిపోయేవారు. పాజిటివ్ కేసు కనిపిస్తే కుటుంబ సభ్యులతోపాటు, వారితో సంబంధం ఉన్న వారిని ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులుగా పరిగణించేవారు. అటువంటి వారిని జల్లెడ పట్టి మరీ గుర్తించేవారు. ప్రత్యక్ష బాధితులతో సమానంగా కాంటాక్టు వ్యక్తులను పరోక్షంగా హెచ్చరిస్తూ వారిని సేఫ్ జోన్‌ల్లో ఉంచేవారు. కానీ లాక్‌డౌన్ ఆంక్షల తొలగింపు, సడలింపుల తర్వాత జిల్లాలో పరిస్థితి దాదాపు వైద్యులు, అధికారుల చేతులు దాటేసింది. దీంతో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఆంక్షల సడలింపు తర్వాత జనం విచ్చలవిడిగా రోడ్లపై తిరిగేస్తున్నారు. కాంటాక్టు వ్యక్తులు కూడా న్యూనత భావంతో ఎవరికీ చెప్పకుండా సొంతంగా మందులు వాడేస్తున్నారు. దీంతో ఈ శాఖ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ మ్యాపింగ్‌కు అంతుచిక్కడం లేదు. ఫలితంగా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య ప్రతీ రోజూ వెయ్యికి పైగా దాటేస్తున్నాయి. కొంతకాలం నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తుల సమాచారం రాబట్టడం జిల్లా అధికారులకు, వైద్యులకు కష్టసాధ్యంగా మారింది. పాజిటివ్ వ్యక్తులతో టచ్‌లో ఉన్న వారిని వెతికి పట్టుకోవడం, వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం సచివాలయ, వైద్య, ఆరోగ్య సిబ్బందికి గగనంగా మారింది. వాస్తవానికి కొవిడ్ సోకిన వారితో టచ్‌లో ఉన్న వారిని 24 గంటల్లో గుర్తించి, మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ సంబంధిత సిబ్బంది ఆ పని చేయలేక పోతున్నారు.
ప్రతీ రోజూ కేసులు వెయ్యికి పైగా నమోదవుతుండడంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించలేకపోతున్నారు. గతంలో నమోదైన కేసుల కాంటాక్టు వివరాలే పూర్తిగా సేకరించలేకపోయారు. బాధితులు కూడా తాము కలిసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని తెలుస్తోంది. ఒక పాజిటివ్ కేసు బయటపడితే దానికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టుగా కుటుంబ సభ్యులతోపాటు, బాగా దగ్గరగా ఉన్న వారిని సుమారు ఏడుగురిని గుర్తించాలి. వీరిలో కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు చేయించాలి. సదరు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో మ్యాపింగ్ చేయాలి. వీరందరినీ హోంక్వారంటైన్‌లో ఉంచాలి. ఈ తతంగాన్ని ఏప్రిల్ నుంచి జూన్ వరకు పక్కాగా అమలు చేశారు. తర్వాత కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో సిబ్బంది చేతులెత్తేశారు. సెకండరీ కాంటాక్టు వ్యక్తులను 14 మందిని గుర్తించాలి. ప్రాథమిక వ్యక్తుల పట్ల తీసుకున్న చర్యలే వీరికి అవలంభించాలి. కానీ ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులను గుర్తిం చడంలోనే తడబడుతున్న సిబ్బంది.. సెకండ్ కాంటాక్టు వ్యక్తులను గుర్తించడం పూర్తిగా పక్కనబెట్టేశారని సమాచారం. జూలై నెల నుంచి ఇప్పటివరకు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తు లను సుమారుగా 6 వేల మందిని గుర్తించలేకపోయారు. సెకండరీ వ్యక్తులు 8 వేల మంది వరకు ఉంటారు. ఈ వివరాల సేకరణలో తాత్సారం జరుగుతోంది. ఈ వైరస్‌ను చాలా మంది తేలిగ్గా తీసుకోవడంతో కొందరు బాధితులు తమతో టచ్‌లో ఉన్న వారి వివరాలు సిబ్బందికి చెప్పడం లేదు. దీంతో వైరస్ ఉధృతికి దారి తీస్తోందని తెలుస్తోంది.