-
-
Home » Andhra Pradesh » East Godavari » vice mpp mother death
-
మాజీ ఎంపీపీకి మాతృ వియోగం
ABN , First Publish Date - 2020-11-27T06:55:57+05:30 IST
వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు, కె.గంగవరం మండలం మాజీ ఎంపీపీ పెట్టా శ్రీనివాసుకు మాతృ వియోగం కలిగింది.

కె.గంగవరం, నవంబరు 26: వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు, కె.గంగవరం మండలం మాజీ ఎంపీపీ పెట్టా శ్రీనివాసుకు మాతృ వియోగం కలిగింది. శ్రీనివాస్ తల్లి విజయలక్ష్మి గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె బాలాంత్రం మాజీ సర్పంచ్‌గా పనిచేశారు. విజయలక్ష్మి మృతికి ఎంపీ పిల్లి సుబాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పండు గోవిందరాజు, మాజీ ఎంపీపీ వట్టికూటి సూర్యచంద్రరాజశేఖర్, సాదా వెంగళరావు, నాయకులు పంపన సుబ్బారావు సంతాపం తెలిపారు.
ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
రామచంద్రపురం, నవంబరు 26: రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య ఉద్యోగాలతోపాటు వైద్యసిబ్బంది ఉద్యోగాలకు ఏడాదిపాటు కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి దరఖాస్తులను కోరుతున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎస్.ప్రవీణ్ తెలిపారు. ఆస్పత్రిలో ఎంబీబీఎస్ వైద్యుడి పోస్టు 1, కౌన్సిలర్ పోస్టు 1, స్టాఫ్‌నర్సు పోస్టు 1, ల్యాబ్‌టెక్నీషియన్ 1 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల27 నుంచిదరఖాస్తు చేసుకోవాలన్నారు.
విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టిన కారు
పి.గన్నవరం, నవంబరు 26: రాజవరం-పొదలాడ ప్రధాన రహదారి ఊడిమూడి వద్ద కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ప్రధాన పంటకాలువవైపు దూసుకుపోయింది. కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం వల్ల కారు పంటకాలువలోకి వెళ్లకుండా ఆగడంతో పెనుప్రమాదం తప్పింది.
యాసిడ్ తాగిన వ్యక్తి మృతి
పి.గన్నవరం, నవంబరు 26: ఒక వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కె.ఏనుగుపల్లికి చెందిన శేరు నరసింహమూర్తి(60) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించారు. మనస్థాపం చెందిన అతడు ఈనెల25న బాత్‌రూమ్స్ శుభ్రం చేసే యాసిడ్ తాగాడు. కుటుంబసభ్యులు అతడిని పి.గన్నవరం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అమలాపురం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం అతడు మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పీహెచ్‌డీ ప్రదానం
రామచంద్రపురం, నవంబరు 26: రామచంద్రపురం డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న పసుపులేటి నాగమణికి పీహెచ్‌డీ ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, హైదరాబాద్‌కు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పర్యవేక్షణలో ఆంధ్ర ప్రతిష్ట, పరిశీలన అనే అంశంపై నాగమణి సిద్ధాంత వ్యాసం సమర్పించారు. దీంతో ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు. రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి.సుభాషిణి, వైస్ ప్రిన్సిపాల్ ఓబిలినేని శ్రీనివాసరావు తదితరులు ఆమెను అభినందించారు.
నిరాడంబరంగా తెప్పోత్సవం
మండపేట, నవంబరు 26: కొవిడ్ నిబంధనల నేపథ్యంలో మండపేట పట్టణంలోని అగస్తేశ్వరజనార్ధన స్వామి తెప్పోత్సవం సాదాసీదాగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి నీటి తొట్టెలో స్వామివారి దీపోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్ కేసులు నమోద వుతున్న దృష్ట్యా ఏడాది నిరాడంబరంగా చేశారు.