పంట ప్రభుత్వమే కొంటుంది.. అధైర్యపడొద్దు

ABN , First Publish Date - 2020-12-05T06:09:12+05:30 IST

రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ రైతులకు భరోసా ఇచ్చారు.

పంట ప్రభుత్వమే కొంటుంది.. అధైర్యపడొద్దు

జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ 

సీతానగరం, డిసెంబరు 4: రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన మండలంలోని  రైతులు పండించిన ధాన్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం అమ్మకాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులను  అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల క్రితం తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. అందుకు జేసీ స్పందిస్తూ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వరద తుఫాన్‌వల్ల 45 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దెబ్బతిందని, వీటి కొనుగోలుకు  426 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 1126 రైతు భరోసా కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. మిల్లర్లతో మాట్లాడామని ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.  మినిమమ్‌ సపోర్ట్‌ ఫ్రైస్‌ నిర్ణయించి కొనుగోలు చేస్తామన్నారు. రైతుల వద్ద ధాన్యం మిగిలివుంటే 88866113611కు కాల్‌ చేయాలని రైతులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎల్‌.శివమ్మ, ఎంపీడీవో కె.రమేష్‌, ఏడీఏ మల్లిఖార్జునరావు, ఏవో కె.సూర్యరమేష్‌, వీఆర్వో పుల్లారావు, ముదునూరి ప్రసాదరాజు, సహకార సంఘం అధ్యక్షుడు వడ్లమూరు సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-05T06:09:12+05:30 IST