లంపిస్కిన్‌కు మూగజీవాల బలి

ABN , First Publish Date - 2020-03-08T09:14:49+05:30 IST

లంపి స్కిన్‌కు మూగ జీవాలు బలి అవుతున్నాయి. రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయి. గోకవరంలో మూడు రోజుల నుంచి సుమారు 25 ఆవులు

లంపిస్కిన్‌కు మూగజీవాల బలి

గోకవరంలో 25 వరకు పశువుల మృత్యువాత


గోకవరం, మార్చి 7: లంపి స్కిన్‌కు మూగ జీవాలు బలి అవుతున్నాయి. రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పశువులు చనిపోయాయి. గోకవరంలో మూడు రోజుల నుంచి సుమారు 25 ఆవులు మృత్యువాతపడ్డాయి.  ఆవులకు, దూడలకు, ఎద్దులకు శరీరంపై నల్లటి వలయాకారంలో మచ్చలు వస్తున్నాయి. ఆవు శరీరం వెనుక వైపు, పొదుగు సమీపంలోను, మెడ కింద(గంగిడోలు) భాగంలోను ఈ ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటిరోజు ఒక పెద్ద మచ్చతో ప్రారంభమై మూడు రోజులకు పశువుల శరీర భాగాలను ఈ మచ్చలు కమ్మేస్తున్నాయి. ఆ తర్వాత మచ్చలు పుండ్లుగా మారి పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇలా నడిశెట్టి అప్పారావు అనే పాడి రైతుకు చెందిన 15, అల్లాడ గాంధీకి చెందిన ఐదు ఆవులు మృతి చెందాయి.


చనిపోయిన వాటిని ఎప్పటికప్పుడు ఖననం చేస్తున్నారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నా నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు.  వ్యాధి సోకిన మూడు రోజుల్లోనే పశువులు చనిపోతున్నాయని చింతల రామకృష్ణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.  ఈ విషయంపై గోకవరం పశు వైద్యాధికారి చక్రవర్తిని వివరణ కోరగా ఒడిసా నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందిందన్నారు.  ఒక పశువు నుంచి మరొక పశువుకు గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. ఎక్కడైనా పశువులకు వ్యాధి సోకినట్లు గుర్తిస్తే తనను సంప్రదించాలని చికిత్స అందిస్తామని చెప్పారు. పశు వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. 

Updated Date - 2020-03-08T09:14:49+05:30 IST