ఎన్జీటీ బృందం రాకతో.. బండారం బట్టబయలైంది!

ABN , First Publish Date - 2020-12-11T06:46:11+05:30 IST

కాకినాడలో ఇళ్ల స్థలాల పేరుతో నిబంధనలను తుంగలోతొక్కి మడ అడవులను అడ్డగోలుగా నరికేసిన అధికారుల తీరు ఎన్జీటీ బృందం సాక్షిగా గురువారం బట్టబయలైంది.

ఎన్జీటీ బృందం రాకతో.. బండారం బట్టబయలైంది!
ఇది మడ అడవి కాదంటూ రెవెన్యూ రికార్డులు కమిటీ సభ్యులకు చూపిస్తున్న జేసీ, డీఎఫ్‌వో

నిజాలు నిగ్గుతేలాయి

కాకినాడ దుమ్ములపేటలోని మడ భూముల్లో పర్యటించిన ఎన్జీటీ బృందం 

వేలాది చెట్లను నరికి చదును చేసిన వందెకరాల ఇళ్ల స్థలాల ప్రాంతం క్షుణ్ణంగా పరిశీలన

పూడ్చేసిన కాలువ,చదునుచేసిన చోట మొలిచిన మడ మొక్కలు చూసి అవాక్కైన బృందం

తక్షణం కాలువను తెరవాలని అక్కడికక్కడే డీఎఫ్‌వోకు ఆదేశాలు

అవి రెవెన్యూ భూములని, అక్కడ అడవులే లేవని అడ్డంగా వాదించిన రెవెన్యూ, అటవీ శాఖలు

కచ్చితంగా అవి మడ భూములేనని ఆధారాలు చూపించిన పర్యావరణ వేత్తలు

పూర్వపు ప్రాంత శాటిలైట్‌ చిత్రాలు, పూడ్చిన కాలువను చూపించిన టీడీపీ

ఆధారాలు చూపించిన వారందరితో వైసీపీ నాయకుల వాగ్వాదం, బెదిరింపులు


కాకినాడలో ఇళ్ల స్థలాల పేరుతో నిబంధనలను తుంగలోతొక్కి మడ అడవులను అడ్డగోలుగా నరికేసిన అధికారుల తీరు ఎన్జీటీ బృందం సాక్షిగా గురువారం బట్టబయలైంది. గుట్టచప్పుడుకాకుండా పూడ్చేసిన ఉప్పుటేరు పిల్లకాలువ, చదునుచేసిన చోట పుట్టుకొచ్చిన మడ మొక్కలు అసలు నిజాలను బయటపెట్టాయి. మడ అడవుల విధ్వంసం చేసిన తీరును కళ్లకుకట్టాయి. అయితే అడ్డగోలు అబద్దాలతో ఎన్జీటీ కళ్లకు గతంలు కట్టి పర్యటన  పూర్తి చేయించాలని జిల్లా అధికారులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. అక్కడ మడ అడవులు లేనేలేవని, ఒకప్పుడు రొయ్యల చెరువులంటూ నమ్మించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అటు ఇళ్ల స్థలాల ప్రాంతంలో పచ్చటి మడ అడవులు, పారే ఉప్పుటేరు కాలువలున్న మాట నిజమేనంటూ పర్యావరణ వేత్తలు, టీడీపీ అన్ని ఆధారాలను ఎన్జీటీకి అందించాయి. అటు నిజాలు బయటపడుతుండడంతో ఉలిక్కిపడ్డ వైసీపీ ఆధారాలు చూపిస్తున్న వారిపై విరుచుకుపడ్డంతో ఉద్రిక్తత నెలకొంది.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి/ డెయిరీఫారం సెంటర్‌): కాకినాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాలకు భూముల కొరత ఉండ డంతో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. నిబంధనలకు వ్యతిరేకంగా దుమ్ములపేటలో సర్వే నంబర్లు 2004, 1985/3, 1990, 374, 376, 387లలో గల వంద ఎకరాల మడ చెట్లను ధ్వంసం చేసి రాత్రికిరాత్రి చదునుచేసేసింది. అడ్డుకోవాల్సిన అటవీశాఖ సైతం వంతపాడింది. ఈనేపథ్యంలో విశాఖకు చెందిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదుచేశారు. ఈ ఏడాది మేలో కేసు ను విచారించిన ఎన్జీటీ ఇళ్ల స్థలాల కోసం మడఅడవుల నరికివేత జరిగిందా? లేదా? నిర్థారించాలని ఆదేశిస్తూ ప్రత్యేక కమిటీని నియమించింది. ఈనేపథ్యంలో కమిటీ తరఫున డాక్టర్‌ సి పాల్పండి, శాస్త్రవేత్త ఎం మహిమల బృందం గురువారం కాకినాడలో పర్యటించింది. మడ మొక్కలు ధ్వంసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్న లేఅవుట్‌ ప్రదేశాన్ని, మూసివేసినట్టు చెబుతున్న ఉప్పుటేరు సహజసిద్ధ పిల్ల కాలువలను సందర్శించింది. అయితే కమిటీ వస్తున్న విషయాన్ని జిల్లా అధికారులు రహస్యంగా ఉంచారు. తాము చెప్పిన వాదన మాత్రమే ఈ కమిటీ విని అనుకూలంగా నిర్ణయం వ్యక్తం చేయాలనే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గురువారం ఉదయం దుమ్ములపేటలో చదునుచేసిన ఇళ్ల స్థలాల వద్దకు బృందాన్ని తీసుకువచ్చారు. అక్కడ మడ అడవులు లేవని, ఒకప్పుడు రొయ్యల చెరువులు సాగుచేశారంటూ కొన్ని కాగితాలను చూపించారు.


అవన్నీ రెవెన్యూ భూములేనని నమ్మబలికారు. ఈ ప్రాంతంలో మడఅడవుల చరిత్ర లేదని, ఒకటీ అరా ఉన్నా పలు తుఫాన్లకు ఎప్పుడో పోయాయంటూ వాదించారు. దీనికి జిల్లా అటవీ శాఖ కూడా వంతపాడింది. అయితే అంతా అనుకున్నట్టు పద్ధతిగా సాగిపోతున్న ఎన్జీటీ బృందం పర్యటన కాస్తా పర్యావరణవేత్తలు, టీడీపీ నేతలు అక్కడకు రావడంతో ఒక్కసారిగా మలుపు తిరిగింది. అసలు నిజాలన్నీ బయటపడేలా చేసింది. ఎన్జీటీ బృందాన్ని పర్యావరణవేత్త బొలిశెట్టిసత్యతోపాటు మరికొందరు కలిసి వాస్తవాలు వినిపించారు. మడఅడవులు నరికివేసి స్థలాల ను అడ్డగోలుగా చదునుచేశారంటూ శాటిలైట్‌ చిత్రాల మ్యాప్‌లను అందించారు. ఇళ్ల స్థలాల చదునుకు ముందు అక్కడ మడ అడవులున్నాయనే విషయాన్ని సామాజికవేత్త తోట రాంబాబు గూగుల్‌ ఎర్త్‌లో చూపించారు. కాలువలు పూడ్చి మడ మొక్కలు నరికిన ప్రాంతాలను స్పష్టంగా చూపించారు. దీంతో నరికిన మడ మొక్కలను కమిటీ సభ్యులు ఫోటోలు, వీడియో తీశారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ నగర టీడీపీ సైతం అక్కడకు చేరుకుంది. జిల్లా అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలని కమిటీకి వివరించింది. వందెకరాలను చదునుచేయ డం కోసం సహజసిద్ధంగా పారే ఉప్పుటేరు కాలువను ఏ విధంగా మూసివేశారనేదానిపై కొండబాబు వివరించారు. కాలువ మూసివేతతో మత్స్యకారులకు వేట ఆగిపోయి నష్టపోయారని తెలిపారు. పూడ్చివేసిన కాలువ వద్దకు టీడీపీ నేతలు కమిటీ సభ్యులను తీసుకువెళ్లి చూపించారు. తీరా అక్కడ కాలువను పూడ్చివేసిన ఆనవాళ్లు పక్కాగా కనిపించడంతో ఎన్జీటీ నివ్వెరపోయింది.


తక్షణం దీన్ని తిరిగి తవ్వాలని అక్కడికక్కడే డీఎఫ్‌వోను ఆదేశించింది. దీనికి అధికారులు ఏదో సమాధానం చెప్పబోతే వినడానికి ఇష్టపడలేదు. మరోపక్క చదును చేసిన ఇళ్ల స్థలాల్లో గతంలో నరికివేసిన మడ మొక్కలు మళ్లీ మొలిచిన విషయాన్ని గమనించిన  కొండబాబు ఎన్జీటీకి ఈ విషయం చూపించారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో మడ మొక్కలు మొలుస్తున్నా యని, ఇక్కడ మడ అడవులు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనమని ఎన్జీటీ సభ్యులకు వివరించారు. వందల సంవత్సరాలుగా ఉప్పు టేరు పిల్ల కాలువలపై ఆధారపడి మత్స్యకారులు జీవనోపాధి  పొందుతున్నారని, ఇక్కడి మడ అడవులలో వన్యప్రాణులు, అరు దైన పక్షులు చాలా ఉండేవన్నారు. ఉప్పుటేరు పిల్ల కాలువలను మూసివేశారని సభ్యులను తీసుకెళ్లి చూపించారు. దీంతో అసలు విషయం బయటపడ్డట్టయింది. అంతేకాకుండా అసలు నిజాలు ఏంటనేది వివరిస్తూ టీడీపీ తరఫున ఆధారాలతో కూడిన మెమోరాండం, వీడియో క్లిపింగ్‌లతో కూడిన పెన్‌ డ్రైవ్‌లు అందించారు.


చదునుకు ముందు అక్కడ మడ మొక్కలు ఎలా ఉన్నాయనేదానిపై శాటిలైట్‌ చిత్రాలు, మ్యాపులు, పత్రికా కథనాలను తర్జుమా చేసి ఆధారాలతో సహా అందించారు. విషయం తెలుసుకున్న వైసీపీ అక్కడకు వచ్చి ఆధారాలు అందించిన పర్యావరణవేత్తలు,టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగింది. ఇళ్లస్థలాల వద్దకు ఎందుకు వచ్చారంటూ పలువురు వైసీపీ నేతలు ప్రశ్నించారు. స్థలాల చదునుపై ఎన్జీటీకి ఫిర్యాదుచేసిన పర్యావరణవేత్తను దాదాపు కొట్టేంత పనిచేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసు బలగాలు రావడంతో ఎన్జీటీ బృందం అక్కడే ఉన్న జీఎంఆర్‌ పరిశీలనకు వెళ్లింది. అక్కడ కూడా తవ్విన మడచెట్లను పరిశీలించింది.


ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ఠ టెర్మినల్‌ పరిశీలన

అల్లవరం/మామిడికుదురు, డిసెంబరు 10: జాతీయ హరిత ట్రిబ్యునల్‌ బృందం సభ్యులు రెండో రోజైన గురువారం ఓడలరేవులోని ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ వశిష్ఠ టెర్మినల్‌ను పరిశీలించారు. ఇక్కడి కార్యకలాపాల ద్వారా పర్యావరణ సమతుల్యానికి ఆటంకం కలిగే పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నీటి రుచి, వాసన చూసి పరీక్ష నిమిత్తం సీసాల్లో నీరు తీసుకెళ్లారు. భూగర్భ జలాల శుద్ధతను పరీక్షించేందుకు ఓడల రేవు గ్రామంలోని చేతిపంపుల నుంచి వచ్చిన నీటిని సీసాల్లో పట్టుకెళ్లారు. తర్వాత ఎన్జీటీ సభ్యులు మామిడికుదురు మండలం నగరంలో 2014లో గ్యాస్‌ పైపులైన లీకైన ప్రదేశాన్ని పరిశీలించారు. బృందంలో మినిసీ్ట్ర ఆఫ్‌ ఎన్విరాన్మెంట్‌ ఫారెస్టు, క్లైమేట్‌ఛేంజ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సిల్పాండి, పర్యావరణ శాస్త్రవేత్త టి.మహిమ, పర్యావరణ శాఖ ఇంజనీర్‌ పి.రవీంద్రనాథ్‌, ఆంథ్రోపాలజీ శాస్త్రవేత్త దీప ఉన్నారు. Updated Date - 2020-12-11T06:46:11+05:30 IST