స్వచ్ఛత దిశగా..
ABN , First Publish Date - 2020-09-03T11:02:37+05:30 IST
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబరు వరకు తలపెట్టిన ‘మనం-మన పరిశుభ్రత’లో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన పంచాయతీల్లో స్వచ్ఛత దిశగా

‘మనం- మన పరిశుభ్రత’లో ప్రజా భాగస్వామ్యంతో మెరుగైన పారిశుధ్యం
గ్రామాల్లో ప్రతీ కుటుంబం నుంచి నెలకు రూ.60 వసూలు
పైలట్ ప్రాజెక్టుగా మండలానికి రెండు పంచాయతీల్లో నిర్వహణ
సక్సెస్ రేటును బట్టి అన్ని పంచాయతీల్లో అమలు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబరు వరకు తలపెట్టిన ‘మనం-మన పరిశుభ్రత’లో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన పంచాయతీల్లో స్వచ్ఛత దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామీణ ప్రాం తాల్లో ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య తీరులో సమూలంగా మార్పు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇందుకు గ్రామాల్లో ప్రతీ కుటుంబం నుంచి రోజుకు రూ.2 వసూలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా మండలానికి రెండు పంచాయతీల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నారు. వస్తున్న ఫలితాలు, సక్సెస్ రేటును డిసెం బరు నెలాఖరుకు బేరీజు వేసి జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో దీనిని అమలు చేయడానికి జిల్లా పంచా యతీ అధికారులు కార్యాచ రణ రూపొందిస్తున్నారు.
ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్య నిర్వహణలో వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్వహణ లోపం, నిధుల లేమి తదితర కారణాలతో ఈ పథకాలు ముందుకు సాగడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రజలు మురికికూపాల్లో నివసించాల్సి వస్తోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రజలను భాగస్వామ్యం చేసి వారి నుంచి స్వల్ప మొత్తంలో నిధులు సేకరించి ‘మనం- మన పరిశుభ్రత’ పేరుతో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ తెరపైకి తీసుకొచ్చిన కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమల వుతోంది. ఇందుకు ప్రతి కుటుంబం నుంచి నెలకు రూ.60 చొప్పున వసూలు చేసి ఆ నిధులను పారిశుఽధ్యం, పచ్చదనం పనులకు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని 62 మండలాల్లో 1072 పంచాయతీలున్నాయి. తొలుత పైలట్ ప్రాజెక్టుగా మండలానికి రెండు పంచాయతీల చొప్పున మొత్తం 124 పంచాయతీల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. కొన్నిచోట్ల నూరుశాతం ఫలితాలు వస్తుండగా, కొన్ని పంచాయతీల్లో పరిస్థితి గాడిలో పడాల్సి ఉంది.
నిధుల వెచ్చింపు ఇలా
124 గ్రామ పంచాయతీల్లో ఒక్కో కుటుంబం నుంచి రూ.2 చొప్పున రోజూ వసూలు చేసి నెల పూర్తయ్యాక వచ్చిన మొత్తాన్ని గ్రామ వలంటీరు, గ్రామ పెద్ద పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. పారిశుధ్య పనులు చేస్తున్న గ్రీన్ అంబాసిడర్‌లకు నెలకు రూ.6 వేల వేతనాన్ని ఈ నిధుల నుంచే చెల్లిస్తున్నారు. పనులకు అవసరమయ్యే పరికరాలు, వాహన నిర్వహణకు వినియోగిస్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించడానికి మండల స్థాయి అధికారులు, ఎంపికచేసిన సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం అన్ని గ్రామీణ మండలాల్లో అవగాహన కల్పిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు అమలు తీరును ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దీంతో అన్ని శాఖల అధికారులు సమష్టిగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. జిల్లాస్థాయిలో జడ్పీ సీఈవో, డీపీవో, డీఎల్పీవోలు, మండల స్థాయిలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖాధికారులు, పశు వైద్యాధికారులు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, ఏపీవో, ఏపీఎం, ఎంపిక చేసిన పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు, సచివాలయ సహాయకులు ఈ కార్యక్రమంలో నిమగ్నమవుతున్నారు.