-
-
Home » Andhra Pradesh » East Godavari » Time table for Nannaya semester exams
-
‘నన్నయ’ సెమిస్టర్ పరీక్షలకు టైం టేబుల్
ABN , First Publish Date - 2020-10-07T08:26:05+05:30 IST
సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ సిద్ధమైందని ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు...

దివాన్‌చెరువు, అక్టోబరు 6: ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్, పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ సిద్ధమైందని ఉప కులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు. టైంటేబుల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి నవంబర్ 3 వరకు జరుగుతాయని చెప్పారు. ఉదయం సైన్స్ విద్యార్థులకు, మధ్యాహ్నం ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. నవంబర్ 4 నుంచి 17 వరకు డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 114 పరీక్ష కేంద్రాలలో 69,159 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఆర్ట్స్ విద్యార్థులకు ఈ నెల 26 నుంచి నవంబర్ 3 వరకు, సైన్స్ విద్యార్థులకు నవంబర్ 5 నుంచి 10 వరకు, ఎంసీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 11 నుంచి 17 వరకు జరుగుతాయని తెలిపారు. 24 కేంద్రాలలో 6170 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. బీఈడీ, బీపీఈడీ, బీపీఈడీ పరీక్షలు ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకూ 14 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పరీక్షల డీన్ ఎ.మట్టారెడ్డి, పరీక్షల కంట్రోలర్ ఎస్.లింగారెడ్డికి పలు సూచనలు చేశారు. ప్రముఖ ఆడిటర్, నన్నయ పూర్వ విద్యార్థి వి.భాస్కరరామ్ నన్నయ వీసీని మర్యాద పూర్వకంగా కలిశారు. రిజిస్ట్రార్ బట్టు గంగారావు తదితరులు పాల్గొన్నారు.
నన్నయ సెట్‌కు 9 వరకు తత్కాల్ దరఖాస్తు
దివాన్‌చెరువు, అక్టోబరు 6: కొవిడ్ కారణాలతో నన్నయ సెట్ 2020కు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులకు విశ్వవిద్యాలయం తత్కాల్‌లో రూ.2000 ఫీజుతో 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డి.జ్యోతిర్మయి మంగళవారం తెలిపారు. నన్నయ సెట్ 2020కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈనెల 16 నుంచి నన్నయసెట్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు.