కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడు
ABN , First Publish Date - 2020-10-01T08:07:51+05:30 IST
కళ్ల ఎదుట ఓ వృద్ధుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సహాయం చేయలేని దుస్థితి జీజీహెచ్‌లో నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి భయం మానవ
పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 30: కళ్ల ఎదుట ఓ వృద్ధుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సహాయం చేయలేని దుస్థితి జీజీహెచ్‌లో నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి భయం మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత మూడు రోజులుగా ఓ గుర్తు తెలియని 60-70ఏళ్ల వృద్ధుడు కిందపడి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. సిబ్బంది, వైద్యులు వృద్ధుడిని చూసుకుంటూ వెళుతున్నారే తప్పా ఏ ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు.
కాకినాడ జీజీహెచ్‌లో మెడికల్ వార్డు విభాగం సమీపంలో కోరమండల్ తాగునీటి ప్లాంటు వద్ద ఆ అభాగ్యుడు కొన ఊపిరితో ఉన్నాడు. నిత్యం వైద్య సేవల కోసం వందలాది మంది రోగులు, సహాయకులు, వారితో పాటు ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఇదే రూటులో రాకపోకలు సాగిస్తుంటారు.
అయితే నేలపై పడి ఉన్న వృద్ధుడిని చూచిన ఓ ఒక్కరూ కనీసం మానవతా దృక్పథంతో అసలు ఏం జరిగింది అని కూడా అడగడం లేదు. వైద్య చికిత్స అందించేందుకు వార్డులోకి కూడా చేర్పించకపోవడం దారుణం. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.