రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-07T08:08:48+05:30 IST

చెరకు రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు...

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

  • మంత్రి బొత్స సత్యనారాయణ  
  • తాండవ సుగర్స్‌ని సందర్శించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ


తుని, అక్టోబరు 6 : చెరకు రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం పాయకరావుపేటలోని తాండవ సుగర్స్‌ని కేబినెట్‌ సబ్‌ కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ పరిస్థితులపై అధ్యయనం చేశారు. అనంతరం రైతులతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి బొత్స మాట్లాడుతూ చెరకు ఫ్యాక్టరీలు నష్టాలు చవిచూడకుండా శాశ్వత పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 12 సహకార రంగంలోని ఫ్యాక్టరీపై అధ్యయనం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో రైతుల బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతులకు ప్రోత్సాహం లేకే చెరకు పంట సాగు క్రమేపీ తగ్గుతోందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ రైతులను పట్టించుకోకుండా వాళ్ళ స్వప్రయోజనాలకోసమే పనిచేశారన్నారు. రైతు లు, కార్మికుల అభిప్రాయాలు తీసుకున్నామని, వీటిని సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ జీతాలు ఇవ్వకపోయినా తల్లిలాంటి ఫ్యాక్టరీని మూసివేయొద్దని కార్మికులు అన్నమాటలకు చలించానన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి రైతుల కన్నీళ్లు తుడిచే వ్యక్తి అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ లాభనష్టాలు కాకుండా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రోత్సాహం అందిస్తే చెరకు పంట వేసేందుకు రైతులు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్‌గణేష్‌, పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గాలకు చెందిన రైతులు తాండవ సుగర్స్‌పై అధారపడి ఉన్నారన్నారు. మద్దతు ధర లభించినప్పుడే రైతులు అభివృద్ధి చెందడంతో పాటు ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయన్నారు. ప్రస్తుతం తాండవ సుగర్స్‌ ఆధునికీకరణ చేసేందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు రైతులు, కార్మికుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఫ్యాక్టరీ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్‌, బీజేపీ నాయకులు తోట నగేష్‌ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసినప్పుడే రైతులకు ఖర్చుతగ్గి పంట గిట్టుబాటు అవుతుందన్నారు. రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తే మరింత మంది రైతులు చెరకు పంట వేసే అవకాశం ఉందన్నారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని, వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో టన్నుకి అద నంగా బోనస్‌ ఇచ్చేవారని, ఆయనలాగే జగన్‌ అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ మౌర్య, ఫ్యాక్టరీ ఎండీ వీవీ రమణారావు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more