భూమి పోతుందనే వేదనతో..గుండె ఆగింది

ABN , First Publish Date - 2020-02-16T09:08:14+05:30 IST

దశాబ్ధకాలానికి పైగా సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు తీసుకుంటామని అధికారులు

భూమి పోతుందనే  వేదనతో..గుండె ఆగింది

చేబ్రోలులో అసైన్డ్‌ రైతు హఠాన్మరణం


గొల్లప్రోలు రూరల్‌, ఫిబ్రవరి 15: దశాబ్ధకాలానికి పైగా సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో అసైన్డ్‌ రైతు గుండె ఆగింది. రెవెన్యూ యంత్రాంగం బెదిరింపుల వల్లె చనిపోయాడని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బంధువులు, దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు(46)చెందిన సత్యాడ బాలరాజుకు సర్వే నెంబరు 288లో రెండు ఎకరాలు, అతని సతీమణి రాజకుమారికి సర్వే నెంబరు 301/1లో రెండు ఎకరాలకు సంబంధించి 2008లో అప్పటి జిల్లా కలెక్టరు డి.ఫారం పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి వీరు సదరు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇళ్లస్థలాలు కోసం భూములు సేకరించాలని ఇచ్చిన ఆదేశాల నేపధ్యంలో అధికారులు ఈ భూములను తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇళ్ల స్థలాలు కోసం భూములు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు.


అంగీకారం తెలుపుతూ సంతకం చేయాలని, లేకుంటే పోలీసుబందోబస్తుతో వచ్చి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారని బాలరాజు కుమార్తె హరిప్రియ తెలిపారు. ఆర్డీవో పరిశీలించి న్యాయం చేయలేదని, స్పందనలో జిల్లా కలెక్టరుకు వినతి అందించినా ఫలితం లేకపోవడంతో బాలరాజు మనోవేదనకు గురై గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. తహసీల్దారు, ఆర్డీవో, వీఆర్వో, గ్రామసచివాలయ సిబ్బంది, సర్వేయరు వీరందరు తన తండ్రి బాలరాజును భూమి ఇచ్చేయాలని ఒత్తిడి తేవడంతో తీవ్ర అందోళనకు గురై గుండెపోటుతో మరణించాడని, బాద్యులపై చర్యలు తీసుకోవాలని సత్యప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికి అధికారులు పట్టించుకోలేదని అందులో పేర్కొన్నారు.


చేబ్రోలులో విషాదం

చేబ్రోలులో అసైన్డ్‌ రైతు బాలరాజు మృతితో విషాదం నెలకొంది. ఇళ్ల స్థలాలు కోసం దళితులకు ఇచ్చిన భూములు లాక్కోవడం ఎంతవరకూ న్యాయమని దళితసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఎంతోమంది బడా రైతుల భూములు ఉండగా దళితుల భూములను తీసుకోవాలనుకోవడం అన్యాయమన్నారు. దళితుల పొట్టగొట్టేందుకు ప్రభు త్వం ప్రయత్నించడం దారుణమని వారు అన్నారు.  బాధ్యు లైన అధికారులు, తహశీల్దారుపై ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయడంతోపాటు బాలరాజుకు చెందిన డి.ఫారం పట్టా భూములను వారి కుటుంబానికి వదిలివేయాలని, కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని దళిత సంఘాల ప్రతినిధులు దానం లాజర్‌బాబు, మూరా కరుణ, సిరిపల్లి రాజేష్‌(మహాసేన) తదితరులు డిమాండ్‌ చేశారు.


బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గొల్లప్రోలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు మడికి ప్రసాద్‌ కోరారు. చేబ్రోలులో మృతుడి ఇంటి వద్ద బంధువులు, దళిత సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచారు. బాధ్యులైన అధి కారులపై ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదుతోపాటు డి.ఫారం పట్టా భూములు తీసుకోబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వా లని, పరిహారం చెల్లించాలని, లేకుంటే ఆందోళన విరమించేది లేదని దళిత సంఘాలు స్పష్టం చేశాయి. వారితో పిఠాపురం సీఐ బి.సూర్యఅప్పారావు చర్చలు జరుపుతున్నారు.

Updated Date - 2020-02-16T09:08:14+05:30 IST