అన్నార్తులకు ఆపన్నహస్తం
ABN , First Publish Date - 2020-03-27T10:16:46+05:30 IST
అసలే లాక్‌డౌన్.. కర్ఫ్యూ కారణంగా బయట ఎవరూ సంచరించని పరిస్థితి. దీంతో రోడ్లపై ఉండే యాచకులు, అనాథలు, నిరుపేదలు
యాచకులు, నిరుపేదలకు ఆహారం అందజేస్తున్న సమాజ సేవకులు
కాకినాడలో అనాథలకు కడుపు నింపుతున్న హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్
మరికొందరు కూడా ముందుకు వస్తే ఎంతోమంది ఆకలి తీర్చొచ్చు
సర్పవరం జంక్షన్(కాకినాడ), మార్చి 26:
అసలే లాక్‌డౌన్.. కర్ఫ్యూ కారణంగా బయట ఎవరూ సంచరించని పరిస్థితి. దీంతో రోడ్లపై ఉండే యాచకులు, అనాథలు, నిరుపేదలు వంటివారు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికోసం మేమున్నామంటూ కొందరు ముందుకొస్తున్నారు. ఆహారం అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. కాకినాడకు చెందిన హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఇలానే పలువురికి ఆపన్నహస్తం అందిస్తోంది. సంస్థ సభ్యులు, వలంటీర్లు బుధవారం రాత్రి కాకినాడ సిటీ, రూరల్‌లో ఆహారం అందజేయడం ప్రారంభించారు.
తమ ఇళ్ల వద్ద తయారు చేయించిన ఆహారాన్ని కారులో తీసుకొచ్చి అందజేశారు. భానుగుడి, పోర్టు ఏరియా, జగన్నాథపురం బ్రిడ్జి, వైఎ్‌సఆర్ బ్రిడ్జి, ఆర్డీసీ బస్టాండ్, జీజీహెచ్, నాగమల్లితోట, సర్పవరం జంక్షన్ వద్ద ఉన్న 150మందికి గురువారం ఆహారం అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.సత్యసుధీర్, సుధారాణి, గౌరవాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మాట్లాడుతూ లాక్‌డౌన్ ముగిసేవరకు భోజనాలు అందిస్తామని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఇలాంటి సేవా కార్యక్రమాలకు కొందరు పూనుకుంటే చాలామంది ఆకలి తీర్చినవాళ్లవుతారు.