ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-05-17T09:25:52+05:30 IST

బూరుగుపూడి ఆవ భూములను పరిశీలించడానికి వచ్చిన టీడీపీ నేతలు రైతు నాయకుడు కంటే కేశవరావు ఇంటి వద్ద

ఉద్రిక్తత

ఆవ భూముల పరిశీలనకు వచ్చిన టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

పోలీసు వలయం ఛేదించి కిలో మీటరు దూరం  నడుచుకుంటూ వెళ్లిన వైనం

అక్కడ జరుగుతున్న పనుల పరిశీలన


కోరుకొండ, మే 16: బూరుగుపూడి ఆవ భూములను పరిశీలించడానికి వచ్చిన టీడీపీ నేతలు రైతు నాయకుడు కంటే కేశవరావు ఇంటి వద్ద రైతులతో సమావేశమై వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం వారు బూరుగుపూడి, కాపవరం గ్రామాల మధ్య ఆవ భూములను పరిశీలించడానికి బయల్దేరారు. ఈ సమయంలో నార్త్‌ జోన్‌ డీఎస్పీ సత్యనారాయణరావు ఆధ్వ ర్యంలో సీఐ కె.పవనన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ విజయకుమార్‌, పోలీసులు వచ్చి వారిని అడ్డగించారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని, అందువల్ల ఎవరూ బయటకు వెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో  పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బ్రాందీ షాపుల వద్ద వందలాది మంది  గుమిగూడినా పట్టించుకోని వారు, ఆవ భూములను పరిశీలించడానికి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. అనంతరం వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నేతలు ఆదిరెడ్డి వాసు, పాలిక శ్రీను, వాసిరెడ్డి రాంబాబు, రైతులు పోలీసులను తప్పించుకుంటూ ముందుకెళ్లారు. పోలీసులు మళ్లీ అడ్డుపడడంతో నెహ్రూ, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వాహనాలు వదిలి  రాజప్ప సహా అందరూ సుమారు కిలోమీటరు దూరం నడుచుకుంటూ వెళ్లారు. తర్వాత వాహనాలు ఎక్కి నాలుగు రకాలుగా విడిపోయి భూముల్లోకి వెళ్లారు. నేతల వాహనాల వెంటపడి పోలీసులు ఆవ భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడ అందరినీ అడ్డగించి కేవలం పది మందిని మాత్రమే పరిశీలనకు అనుమతించారు. మిగిలిన నేతలు, రైతులను అక్కడే ఆపేశారు. ముఖ్య నేతలు బూరుగుపూడి-కాపవరం గ్రామాల మధ్య ఆవ భూముల్లో అధికారుల ఆధ్వర్యంలో చెరువులను పూడ్చడం, రోడ్డు మార్జిన్లు వేయడం తదితర పనులను పరిశీలించారు.  ఇవి ముంపు భూములేనని, ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రతీఏటా ముంపు తప్పదని  ఆ పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు చెప్పారు. ఆవ ముంపు భూముల గురించి  రాజానగరం నియోజకవర్గం అఖిలపక్ష ప్రతినిధుల బృందం టీడీపీ నేతలకు వివరించింది. ఈ స్థలాలను పేదలకు ఇవ్వకుండా చూడాలని, అవినీతిని వెలికితీయడంలో సహకారం అందించాలని, మంచి భూములను పేదలకు ఇచ్చేలా చూడాలని కోరారు. బీజేపీ నేత ఏపీఆర్‌ చౌదరి, జనసేన నేత రాయపురెడ్డి చిన్నా, న్యూడెమో క్రసీ తరపున టి.వెంకటనాయుడు, కాంగ్రెస్‌ పక్షాన శ్రీధర్‌ బాబు, కర్రి వీరనగేష్‌, టీడీపీ    తరపున తనకాల నాగేశ్వరరావు, నాగా రమేష్‌, రొంగల శ్రీనివాస్‌ వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2020-05-17T09:25:52+05:30 IST