లాక్డౌన్ మరింత పటిష్టం చేయాలి
ABN , First Publish Date - 2020-04-05T10:45:47+05:30 IST
పది రోజుల లాక్‌డౌన్‌ను మరింత పటిష్టం గా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

నేటితో 1408 మందికి హోం క్వారంటైన్ పూర్తి
ఆక్వా, వరి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
మంత్రి విశ్వరూప్, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
అమలాపురం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): పది రోజుల లాక్‌డౌన్‌ను మరింత పటిష్టం గా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. క్వారంటైన్ ముగిసిన వారు నిర్భయంగా తిరగవచ్చన్నారు. భౌతిక దూరం విధిగా పాటించాలన్నారు. ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన డివిజన్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో కోనసీమలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. డివిజన్ స్థాయిలో 1,408 మంది హోం క్వారంటైన్ ఆదివారంతో ముగుస్తుందన్నారు. కొత్తపేటలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. సామాజి క మాధ్యమాలు, ఇతర ప్రచార సాధనాల్లో వస్తున్న పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశా రు. కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్న సమయంలో ఎవరైనా అడ్డువస్తే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆక్వా యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాలకు వెళ్లే కూలీలను ఆయా గ్రామాల పెద్దలు అడ్డుకుంటున్నారని, వారి అపోహలు తొలగించడానికి పంచాయతీ కార్యదర్శులు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు.
ఆక్వా కార్మికులు పనులకు వెళ్లేలా, ఉపాధి కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవడానికి ఉత్తర్వులివ్వాలని కలెక్టర్‌ను మంత్రి కోరారు. అమలాపురంలో ప్రత్యేక ఇసుక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని పంచాయతీల్లో పారిశుధ్యం అమలుతీరుపై పంచాయతీ అధికారి వి.నాగేశ్వర నాయక్ సమీక్షించారు. జేసీ జి.లక్ష్మీశ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, కూర గాయలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 12లక్షల కార్డు లకు బియ్యం పంపిణీ చేశామని, మిగిలిన 4లక్షల కార్డులకు త్వరలో పంపిణీ చేస్తా మన్నారు. కొబ్బరి కార్మికులు, వివిధ వర్గాల కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ సతీష్ కుమార్, రాపాక వరప్రసాద్, కొండేటి చిట్టిబాబు, డీఎస్పీ షేక్ మసూమ్‌బాషా, ఆర్డీవో బీహెచ్.భవానీశంకర్, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు వివరించారు.